హైదరాబాద్, విధాత ప్రతినిధి:
20 Lakh Pending Cases | తెలంగాణలో భూమి సమస్యల బాధ అంతా ఇంతా కాదు. దశాబ్దాల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఏలికలు ఎవరైనా హాలికులకు కష్టం యథాతథంగా కొనసాగుతూనే వస్తున్నది. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్న నాటి బీఆరెస్ ప్రభుత్వం ధరణి పేరుతో పోర్టల్‌ను తీసుకువచ్చింది. దానితో సమస్యలు తీరకపోగా.. మరింత పెరిగాయి. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత భూభారతి పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. అయినప్పటికీ భూమి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో రైతాంగం నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఎంత మంచి చట్టం వచ్చినా అమలు చేసే అధికార యంత్రాంగంలో చిత్తశుద్ది లేకపోతే రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనేందుకు నిదర్శనంగా భూభారతి తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బీఆరెస్ సర్కార్ తీసుకొచ్చిన ధరణి చట్టం అధికారులను క్లర్క్‌లుగా మార్చిందనే విమర్శలు ఉన్నాయి. సమస్యలను పరిష్కరించే అధికారం అధికారులకు లేక పోవడంతో సమస్యలు పేరుకు పోయాయి. ఇప్పుడు భూభారతిలోనూ యంత్రాంగం నిబద్ధతతో పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా 20 లక్షలకు పైగా భూమి సమస్యలు అలాగే పేరుకుపోయాయి. దీనికి ప్రధానంగా 2018 తరువాత పాలకుల ఆలోచనల్లో వచ్చిన మార్పులే కారణమని నిపుణులు అంటున్నారు. భూములకు విపరీతంగా రేట్లు పెరగడంతో పాలకులు రంగారెడ్డి జిల్లాను దృష్టిలో పెట్టుకొని నగరం చుట్టూ ఉన్న భూముల కోసమే వ్యవస్థలను ఏర్పాటు చేసి, అధికారాలన్నీ కేంద్రీకరించారు. దీని వల్లే తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారని నిపుణులు అంటున్నారు.
భూమి ఉన్నంత వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రభుత్వాలు సమస్య ఉత్పన్నం కాకుండా గ్రామస్థాయిలో వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. అయినా సమస్య వచ్చిందంటే వెంటనే స్పందించి, పరిష్కరించే వ్యవస్థ ఉండాలి.. కానీ దురదృష్టవశాత్తూ ఉన్న వ్యవస్థనే రైతులకు శాపంగా మారింది. సమస్య పరిష్కారం కోసం చేసే ప్రయత్నం ఎంతో కానీ ఉన్న సమస్యను మరింత జటిలం చేస్తున్నారని జనగామ జిల్లాకు చెందిన ఒక రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
1971 రికార్డ్స్ ఆఫ్ రైట్స్ చట్టం వచ్చిన తరువాత అధికారాల వికేంద్రీకరణ ఉండటంతో ప్రతి సమస్యను తెల్లకాగితంపై దరఖాస్తు చేస్తే అధికారులు పరిశీలించి, విచారణ చేసి నిర్ణయం తీసుకునే వీలుండేది. చాలా మంది రైతులు గ్రామంలో వీఆర్ ఓ తో మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకునేవాళ్లు. ఇది నిరంతర ప్రక్రియలా సాగేది. 2020 నవంబర్ 2న అమలులోకి వచ్చిన ధరణి చట్టం అధికారాలను కేంద్రీకరించింది. అప్పటి వరకు గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికార వ్యవస్థ (వీఆర్వో)ను రద్దు చేశారు. దీంతో గ్రామానికి వెళ్లి భూమి సమస్య ఏమైనా ఉందా? అని పరిశీలించే నాథుడే లేకుండా పోయాడు.
ఈ సమస్యలను పట్టించుకోని ధరణి!
- పట్టా భూములు ప్రభుత్వ భూములుగా, లావుణి పట్టాలుగా నమోదు కావడం.
- పట్టాదారుల పేర్లు తప్పుగా నమోదు కావడం.
- పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరడం.
- కొన్ని సర్వే నంబర్లు మిస్ కావడం.
- భూమి హెచ్చు తగ్గులు నమోదు కావడం.
- ఆర్ ఎస్ ఆర్ పేరుతో ఉన్న భూమి కంటే తక్కువగా నమోదు చేయడం.
- అటవీ–రెవెన్యూ సరిహద్దులు సరిపోలకపోవడం.
- వీటిని పరిష్కరించే అధికారం ధరణి చట్టంలో రెవెన్యూ అధికారులకు లేదు. మీ–సేవలో దరఖాస్తు చేస్తే కారణం లేకుండానే తిరస్కారానికి గురికావడం వంటి సమస్యలతో యావత్ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి చేసిందేంటి?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మూడు రోజులకే భూమి సమస్యలపై నిపుణులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వారం రోజుల్లో కమిటీ వేశారు. అధికారాలను వెంటనే వికేంద్రీకరించి ఆర్డీఓలు, తాసీల్దార్లకు బదలాయించారు. బీఆరెస్ పాలనలో గ్రామాలలో పేరుకు పోయిన భూమి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ సదస్సులు అసలు జరగలేదు. కారణం ఏమిటో కానీ అధికార వ్యవస్థ ప్రభుత్వ నిర్ణయాలను నిబద్దతతో అమలు చేయలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పైలట్ ప్రాజెక్టులు చేపట్టిన చోట్ల కొంత పని జరిగిందని భూమి వ్యవహారాల నిపుణులు చెపుతున్నారు. ఒక వైపు ధరణి చట్టంలోనే కింది స్థాయికి అధికారాలను బదిలీ చేసిన సర్కారు శరవేగంగా 2025 ఏప్రిల్ 14వ తేదీన భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. వెంటనే వర్కింగ్ రూల్స్ కూడా తీసుకు వచ్చారు. భూ భారతి చట్టం పై మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించారు. గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూమి సమస్యలపై గ్రామాలలోనే దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. రద్దు అయిన గ్రామ స్థాయి రెవెన్యూ పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించారు. సర్వేయర్ల కొరత నివారణకు ప్రభుత్వం లైసెన్డ్స్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకు వచ్చింది. ఇంత వరకు విప్లవాత్మకంగా నిర్ణయాలు తుసుకున్నారు కానీ అమలు తీరు మాత్రం అస్సలు బాగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో రేవంత్ సర్కార్ ఫైయిల్ అయిందన్న టాక్ కూడా వచ్చింది.
అధికారులు తీసుకున్న కొద్దిపాటి దరఖాస్తులే లెక్కిస్తే రాష్ట్రవ్యాప్తంగా 8.65 లక్షల వరకూ వచ్చాయని ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. దాదాపు20 లక్షల భూమి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం అధికారాలను వికేంద్రీకరిస్తే.. అధికారులు పరిష్కరించింది చాలా తక్కువ. అందుకే రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరిస్తే తిరిగి ఇప్పటి వరకు మీరేమి చేశారని ప్రశ్నిస్తారని రైతుల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకోలేదన్న విమర్శలు వెలువడ్డాయి. అయితే 2025 మే 2వ తదీన భూ భారతిలో11,630 సమస్యలు ప రిష్కరించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇవి కాకుండా సాదాబైనామా దరఖాస్తులు 9.26 లక్షలు అదనంగా ఉన్నాయి.
ధరణిలో అక్రమాలను బయటకు తీసి భూమి దందా చేసిన వారితో ఊచలు లెక్కపెట్టిస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేపడతామని 2023 డిసెంబర్13వ తేదీన ప్రకటించారు. ఇప్పటి వరకు ఫోరెన్సిక్ ఆడిటింగ్ ఊసే లేదు. ధరణిపై వేసిన కమిటీ ధరణిలో జరిగిన అక్రమాలు, పొరపాట్లపై 1100 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. కానీ సర్కారు ఈ నివేదికను బయటకు రాకుండా తొక్కి పెట్టిందని అంటున్నారు.
అధికారాల వికేంద్రీకరణ జరిగిన తరువాత కూడా అధికారులు కావాలనే దరఖాస్తులు పరిష్కరించడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం డ్యాష్ బోర్డు క్లియరెన్స్ ఉండాలన్న తీరుగా అధికారులు ఎలాంటి కారణం లేకుండానే చిన్న చిన్న సాకులతో తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ డ్యాష్ బోర్డులో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారు? అనే సమాచారం కూడా పబ్లిక్ డొమెన్‌లో ఉంచడం లేదు. భూ భారతి అమలులోకి వచ్చిన తరువాత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ 2025 ఆగస్టు 15వ తేదీ నాటికి సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రకటన చేశారు. 2025 నవంబర్ 21వ తేదీ నాటికి కూడా వాళ్లు అధికారికంగా స్వీకరించిన 8.65 లక్షల దరఖాస్తుల్లో 1,11,093 మాత్రమే పరిష్కరించారట. వీటిల్లో కూడా తిరస్కరణకు గురైనవే ఎక్కువగా ఉంటాయన్న సందేహాలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ చూపించి, లెక్కలేనన్ని దరఖాస్తులు రిజక్ట్ చేస్తున్నారు. ధరణిలో లక్షల ఎకరాల పట్టా భూములు ప్రభుత్వ భూములుగా, అసైన్డ్ భూములుగా నమోదు అయ్యాయి. అనేక మంది పేర్లు తప్పు పడ్డాయి. ఎక్సెంట్ మిస్ మ్యాచ్ అయింది. వీటన్నింటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, విచారణ చేసి తప్పులు సవరించాలి. కానీ దీనికి భిన్నంగా అధికార వ్యవస్థ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చివరకు కోర్టు ఆదేశాలున్న వాటిని కూడా పరిష్కరించడం లేదంటున్నారు. భూమి విలువలు ఎక్కువగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి తదితర జిల్లాల్లో భూమి సమస్యల పరిష్కారానికి భూమి ధరలో 30 నుంచి 40 శాతం వరకు డిమాండ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎవరైనా తమకు సమస్య ఉందని అధికారుల వద్దకు వెళితే పై వాళ్లు చెప్పాలని అంటున్నారని బాధితులు వాపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి దేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని విప్లవాత్మక భూమి చట్టాలు ఉన్నాయి. కానీ అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో జాగీర్దార్ అబాలిష్ చట్టం, టెనన్సీ యాక్ట్, భూమి సీలింగ్ చట్టం, ఆర్ ఓ ఆర్ చట్టం, అసైన్డ్ భూముల చట్టం, ధరణి చట్టం,. తాజాగా భూ భారతి చట్టం ఉంది. అమలులో ఉన్న చట్టాలను రెవెన్యూ యంత్రాంగ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతోనే ఆశించిన ఫలితాలు రాక సమస్యలు పేరుకు పోతున్నాయంటున్నారు. ఖరీదైన ప్రాంతాలలో రాజకీయ నేతల జోక్యంతోనూ భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఫలితాలు రావాలంటే చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
భూ భారతి చట్టం ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేంత గొప్పగా తయారైంది. ఎంత మంచి చట్టమైనా అమలు అంత సమర్థవంతంగా ఉంటేనే ఫలితాలు వస్తాయి. ఈ రోజు చట్టం పకడ్భందీగా అమలు జరగాలంటే… చట్టం ఎలా అమలు చేయించుకోవాలనే విషయంలో ప్రజలకు అవగాహన కలిగించాలి. అధికారులకు చట్టం అమలుపై శిక్షణ ఇవ్వాలి. అజమాయిషీ ఉండాలి. ముఖ్యంగా భూమి సమస్యలు చట్టం వెలుగులో గ్రామ స్థాయిలోనే ప్రజల ముందే పరిష్కారం చేయడం కీలకం.
– భూమి సునీల్, ప్రముఖ న్యాయవాది, భూమి సమస్యల నిపుణులు, వ్యవసాయ కమిషన్ సభ్యులు
ఇవి కూడా చదవండి..
22a List Controversy | తెలంగాణ రైతులకు సర్కార్ షాక్! కోటి ఎకరాల భూములపై లావాదేవీలు బంద్!
HILT Policy Controversy | రెండేళ్లుగా రేవంత్ సర్కార్‌లో లీకు వీరుల హవా.. హిల్ట్ పాలసీ లీక్ తో దుమారం!
Two Years Congress Ruling | 23 నెలల కాంగ్రెస్ పాలన.. 2.5 లక్షల కోట్లు అప్పులు! బకాయిదారులకు మొండి చెయ్యే!!
