Layoffs : ప్రముఖ టెక్ దిగ్గజం అయిన యాపిల్ సంస్థ మరో 600 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. మే 27 నుంచి తొలగింపు వర్తిస్తుందంటూ మార్చి 28న 614 మంది ఉద్యోగులకు పంపిన లేఖలో యాపిల్ పేర్కొంది. తొలగించబడిన ఈ ఉద్యోగులంతా శాంటా క్లారాలోని ఎనిమిది కార్యాలయాల్లో పని చేస్తున్నారు.
కొవిడ్-19 మహమ్మారి విజృంభన తర్వాత యాపిల్ సంస్థ ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. కొవిడ్ టైమ్‌లో భారీగా రిక్రూట్‌మెంట్‌లు చేపట్టిన చాలా మటుకు టెక్ కంపెనీలు గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. యాపిల్ సంస్థ గతంలో కూడా వందల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
కాగా, ఇప్పుడు యాపిల్ చేపట్టిన తాజా లేఆఫ్స్‌కు రెండు కీలక ప్రాజెక్టులు మూతపడటమే కారణంగా తెలుస్తున్నది. కార్ల తయారీకి సంబంధించి యాపిల్ 2014 నుంచి ప్లాన్ చేస్తున్నది. అయితే ఆకస్మికంగా ఆ ప్రాజెక్టును మూసేసింది. ఆ ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగుల్లో కొందరిని తొలగించి, కొందరిని ఇతర విభాగాలకు మార్చింది. అదేవిధంగా మైక్రో ఎల్‌ఈడీ యాపిల్ వాచ్ ప్రాజెక్టుకు కూడా యాపిల్ మంగళం పాడింది. అదే తాజా లేఆఫ్స్‌కు దారితీసింది.