Silver, Gold Price| ఆల్ టైమ్ రికార్డ్సు బాటలోనే వెండి..బంగారం ధరలు

వెండి, బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్లుగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలలో సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్సు నమోదు చేస్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజునే వెండి కిలో ధర రూ. 9000పెరిగి రూ.2,54,000కు చేరింది. 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.770పెరిగి రూ.1,40,020కి చేరింది.

 

విధాత : వెండి, బంగారం ధరలు( Silver, Gold Price) తగ్గేదేలే అన్నట్లుగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలలో సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్సు( All Time Recor) నమోదు చేస్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజునే వెండి కిలో ధర రూ. 9000పెరిగి రూ.2,54,000కు చేరింది. డిసెంబర్ 17న 2,22,000గా ఉన్న కిలో వెండి ధర 10రోజుల్లోనే రూ.2,54,000కు చేరడం కొనుగోలు దారులను అశ్చర్యపరిచింది. అయితే మార్కెట్ నిపుణుల అంచనాల మేరకే ధరలు పెరుగుతుండటం గమనార్హం.

త్వరలోనే కిలో వెండి రూ.3లక్షలకు..

వెండి వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే రూ.3లక్షలకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా వెండిపై పెట్టుబడులు పెరగడం..పారిశ్రామిక అవసరాలలో వెండి వినియోగం, డాలర్లలో హెచ్చు తగ్గులు, వెండి తవ్వకాలలో లభ్యత పడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో వెండి ధరలు వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాదిలో బంగారం ధర 76శాతం పెరిగితే వెండి ధర ఏకంగా 144శాతం పెరుగుదల నమోదు చేయడం గమనార్హం. పెట్టుబడి సాధనంగానే కాకుండా.. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, సోలార్ ఇండస్ట్రీలో వెండి వినియోగం పెరుగుతుండటంతో, భవిష్యత్తులో కూడా వెండి ధరల పెరుగుదల కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

బంగారం ధరలు కూడా పైపైకే

వెండి దారిలోనే బంగారం ధరలు కూడా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. శుక్రవారం 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.770పెరిగి రూ.1,40,020కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.700పెరిగి రూ.1,28,350కి పెరిగింది. మార్కెట్ నిపుణుల అంచనా మేరకు వెండి తరహాలోనే బంగారం ధరలు కూడా మరింత పెరుగడం ఖాయమని..10గ్రాముల 24క్యారెట్ల బంగారం వచ్చే ఏడాది లో రూ.2లక్షల మార్కు చేరనుందని అంచనా వేస్తున్నారు.

Latest News