Demat Account : డీమ్యాట్ ఖాతా అంటే ఏంటి?

డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు, రకాలు, ఎలా ఓపెన్ చేయాలో, పెట్టుబడిదారులకు దాని ప్రాధాన్యత ఏమిటో తెలుసుకోండి.

Demat Accounts

డీమ్యాట్ ఖాతా గురించి మనం ఎప్పుడో ఒక్కసారి వినే ఉంటాం. అసలు డీ మ్యాట్ ఖాతా అంటే ఏంటి? దీని వల్ల ఉపయోగం ఏంటి? ఎవరైనా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చా? ఈ ఖాతాకు ఇతర బ్యబ్యాంకు ఖాతాలకు ఉన్న తేడా ఏంటి? ఈ ఖాతా ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం.

డీమ్యాట్ ఖాతాతో లాభాలేంటి?

షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుకొనే ఖాతానే డీమ్యాట్ ఖాతాగా పిలుస్తారు. మనం బ్యాంకుల్లో డబ్బులను దాచుకుంటాం. స్టాక్ మార్కెట్ సెక్యూరిటీలను, షేర్లను, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చేదే డీమ్యాట్ ఖాతా. డిజిటల్ రూపంలో సెక్యూరిటీలను కలిగి ఉండటం వల్ల భౌతిక ధృవపత్రాల అవసరం ఉండదు. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. భారతీయ పెట్టుబడిదారులకు పెట్టుబడిని సురక్షితంగా, వేగంగా యాక్సెస్ చేసేందుకు ఈ ఖాతా అనుమతిస్తుంది. ఒక వ్యక్తి షేర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్‌లు, బాండ్‌లు మ్యూచువల్ ఫండ్‌లలో చేసే అన్ని పెట్టుబడులను ఒకే చోట ఉంచేదే డీమ్యాట్ ఖాతా. డీమెటీరియలైజ్డ్ ఖాతా పూర్తి రూపమే డీమ్యాట్ ఖాతా. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ ఎన్ ఎస్ డీ ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ సీడీఎస్ఎల్ సంస్థలు ఉచిత డీమ్యాట్ సేవలను అందిస్తాయి.

డీమ్యాట్ ఖాతా ఎందుకు ప్రారంభించారు?

మీరు ఏదైనా కంపెనీ షేర్లను కొనుగోలు చేశారనుకుందాం. అప్పుడు వాటిని మీ పేరును బదిలీ చేయాలి. అంటే ఈ బదిలీకి సంబంధించిన షేర్ల సర్టిఫికెట్లు డాక్యుమెంట్ల రూపంలో మీకు అందేవి. దీనికి పెద్ద ఎత్తున పేపర్ వర్క్ తో పాటు పేపర్ కూడా అవసరమే. షేర్లు కొనుగోలు చేసినా, విక్రయించిన సమయంలో ఇలా పేపర్ రూపంలో డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే. అందుకే 1996లో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ లో డీమ్యాట్ ఖాతాను ప్రారంభించారు. తొలి నాళ్లలో ఈ ఖాతాను ప్రారంభించాలంటే మ్యాన్యువల్ గా చేయాల్సి వచ్చేది. దీన్ని యాక్టివేట్ చేయాలంటే చాలా రోజుల సమయం పట్టేది. కానీ, ప్రస్తుతం ఈ ఖాతాను ఐదు నిమిషాల్లో ప్రారంభించవచ్చు.

డీమెటీరియలైజేషన్ అంటే ఏమిటి?

డీమెటీరియలైజేషన్ అనేది భౌతిక వాటా సర్టిఫికెట్లను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చే ప్రక్రియ. ఇది నిర్వహించడం చాలా సులభం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుండైనా అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లో వ్యాపారం చేయాలనుకునే పెట్టుబడిదారుడు డిపాజిటరీ పార్టిసిపెంట్ (DP)తో డీమ్యాట్‌ను ఖాతాను తెరవాలి. పెట్టుబడిదారుడు భౌతిక వాటా సర్టిఫికెట్‌లను కలిగి ఉండవలసిన అవసరం లేదు. హోల్డింగ్‌లను సజావుగా ట్రాక్ చేయడం, పర్యవేక్షణను సులభతరం చేయడం దీని ఉద్దేశ్యం. గతంలో షేర్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియకు సమయం పట్టేది. అంతేకాదు ఇదంతా గజిబిజిిగా ఉండేది. డీమ్యాట్ ఖాతా యాక్టివ్ అయిన తర్వాత అన్ని భౌతిక సెక్యూరిటీలను డీమెటీరియలైజేషన్ అభ్యర్థన ఫారం డీఆర్ఎఫ్ తో సమర్పించడం ద్వారా పేపర్ సర్టిఫికెట్ లను డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చవచ్చు. ప్రతి భౌతిక సర్టిఫికెట్ పై సరెండర్డ్ ఫర్ డీమెటీరియలైజేషన్ అని పేర్కొంటారు. అంటే మీరు మీ షేర్ సర్టిఫికెట్లను సరెండర్ చేసినప్పుడు మీకు రశీదు స్లిప్ అందుతుంది.

సురక్షితమైనది…..

షేర్లు, సెక్యూరిటీల దొంగతనం భయం అవసరం లేదు. ఫోర్జరీ, నష్టం, భౌతిక ధృవపత్రాల నష్టాన్ని డీమ్యాట్ ఖాతాతో దూరంగా ఉండవచ్చు. వెంటనే సెక్యూరిటీలను బదిలీ చేయవచ్చు. ట్రేడ్ ఆమోదించిన తర్వాత ఆ షేర్లు మీ ఖాతాకు డిజిటల్‌గా బదిలీ అవుతాయి. అంతేకాకుండా స్టాక్ బోనస్‌లు, విలీనాలు మొదలైన సందర్భంలో మీ ఖాతాలోకి షేర్లు ఆటోమెటిక్ గా వస్తాయి. మీరు మీ స్మార్ట్‌ఫోన్ లేదా డెస్క్‌టాప్‌ని ఉపయోగించి ఆన్ లైన్ లో ట్రేడింగ్ చేయవచ్చు. లావాదేవీలు చేయడానికి మీరు స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.

డీమ్యాట్ ఖాతా తెరవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు…

పాన్ కార్డ్
ఆధార్ కార్డు
చిరునామా రుజువు
పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
గుర్తింపు రుజువు

డీమ్యాట్ ఖాతా రకాలు

భారతదేశంలో నివసిస్తున్న పౌరులంతా రెగ్యులర్ డీమ్యాట్ ఖాతాలను తెరవడానికి అర్హులు. ఇక రీపాట్రియబుల్ డీమ్యాట్ ఖాతా మాత్రం ప్రవాస భారతీయుల కోసం. విదేశాల నుంచి ఈ ఖాతాల ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చు. ఇది ఎన్ఆర్ఈ బ్యాంకు ఖాతాలకు లింక్ చేసి ఉంటే డబ్బులు బదిలీ చేయడం సులభం. ఇక నాన్- రీపాట్రియబుల్ డీమ్యాట్ ఖాతా. ఇది కూడా ఎన్ఆర్ఐలకు మాత్రమే. విదేశాల నుంచి నిధులను బదిలీ చేయడానికి దీన్ని ఉపయోగించలేరు. ఈ రకమైన డీ మ్యాట్ ఖాతాను కలిగి ఉండడం, ఆపరేట్ చేసే వ్యక్తికి ఎన్ఆర్ఓ బ్యాంక్ ఖాతాను లింక్ చేసి ఉండాలి. డీమ్యాట్ ఖాతాలను కలిగి ఉన్న కస్టమర్లు స్టాక్ మార్కెట్ నుంచి సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి ట్రేడింగ్ ఖాతాను తెరవాలి. సెబీ నిర్ధేశించిన నిబంధనల మేరకు ట్రేడింగ్ ఖాతా పనిచేస్తుంది.

డీమ్యాట్ ఖాతా నంబర్…

బ్రోకింగ్ సంస్థ లేదా ఇతర ఆర్థిక సంస్థలు డీ మ్యాట్ ఖాతా ఐడీని జారీ చేస్తాయి. దీన్ని డీపీ ఐడీ అంటారు. అంటే డిపాజిటరీ పార్టిసిపెంట్ ఐడీ. డీపీ ఐడీలో పది అంకెలు ఉంటాయి. ఒక పెట్టుబడిదారుడు భౌతిక షేర్లను డీమ్యాట్‌గా మార్చినప్పుడు, ఒక డీమ్యాట్ ఖాతా నుండి మరొక డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేసినప్పుడు లేదా డీమ్యాట్ ఖాతా నుండి బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేసినప్పుడు ఈ ఇద్దరి ఐడీ నెంబర్లు ఉపయోగిస్తారు.దీంతో ఎవరి ఖాతా నుంచి ఎవరి ఖాతాలోకి జరిగిన లావాదేవీల వివరాలు తెలిసిపోతుంది. డీమ్యాట్ ఖాతా నిర్వహణకు ఆర్ధిక సంస్థలు లేదా బ్రోకింగ్ సంస్థలు ఏటా చార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే అవి ఒక్కో సంస్థకు ఒక్కో రకంగా ఉన్నాయి.