HIV | హెచ్ఐవీ అతి భయంకరమైన వ్యాధి. హెచ్ఐవీ గురించి త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఓ సంచలన నివేదికను బయటపెట్టింది. త్రిపురలో హెచ్ఐవీతో 47 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులో వెల్లడైంది. మరో 828 మంది విద్యార్థులు హెచ్ఐవీ పాజిటివ్‌గా పరీక్షించబడ్డారని, వారికి చికిత్స కొనసాగుతున్నట్లు నివేదిక ద్వారా తేలింది. అయితే 220 స్కూల్స్, 24 కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, చాలా మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది.
త్రిపుర జర్నలిస్ట్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్, త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కలిసి సంయుక్తంగా నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌లో సీనియర్ అధికారి భట్టాఛార్జీ మాట్లాడుతూ.. విద్యార్థులు చాలా మంది డ్రగ్స్‌కు బానిస అవుతున్నట్లు తెలిపారు. త్రిపుర వ్యాప్తంగా ఉన్న మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల నుంచి డేటాను సేకరించినట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు ఐదు నుంచి ఏడు కేసులు నమోదు అవుతున్నట్లు చెప్పారు. హెచ్ఐవీ పాజిటివ్ కేసుల పెరుగుదలకు ఇంటర్‌వెనస్ డ్రగ్ దుర్వినియోగం కారణమని ఆయన స్పష్టం చేశారు. ఇక హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులంతా సంపన్న కుటుంబాలకు చెందిన వారేనని ఆయన తెలిపారు. తల్లిదండ్రుల్లో చాలా మంది ప్రభుత్వ అధికారులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారని వారి పేరెంట్స్ గ్రహించలేకపోతున్నారు.
ఈ ఏడాది మే వరకు 8,729 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇందులో 5,674 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. ఇందులో 4,570 మంది పురుషులు, 1,103 మంది స్త్రీలు ఉండగా, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.