హైదరాబాద్: నగరంలోని పలు జిమ్‌లలో బాడీ బిల్డింగ్ కోసం నిషేధిత ఔషధాలను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి, తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (TGDCA) అధికారులు భారీ దాడులు జరిపారు. శుక్రవారం నగర పోలీసుల సహకారంతో టీజీడీసీఏ అధికారులు సికింద్రాబాద్, మెహిదీపట్నం, టోలిచౌకి, మలక్‌పేట్, పంజాగుట్ట, నర్సింగి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాధాపూర్, కొత్తపేట్, కూకట్‌పల్లి, సూరారం తదితర ప్రాంతాల్లో ఉన్న 20 జిమ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో అధికారులు అనాబాలిక్-అండ్రోజెనిక్ స్టెరాయిడ్లు, మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వంటి డ్రగ్స్ ను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
బాడీ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్ల వినియోగంతో ఆరోగ్య సమస్యలు..
కండరాల పెరుగుదల కోసం బాడీ బిల్డర్లు పలు రకాల స్టెరాయిడ్స్ వాడుతుంటారు. అయితే వీటి దుర్వినియోగం వల్ల వల్ల గుండె సంబంధిత సమస్యలు, కాలేయ నష్టం, హార్మోన్ల అసమతుల్యత, మానసిక అస్తిరత వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యాధికారలు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా శస్త్రచికిత్స సమయంలో స్పైనల్ అనస్థీషియా వల్ల తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్) వచ్చినప్పుడు మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అనేది కార్డియాక్ స్టిమ్యులెంట్ కోసం వాడే ఔషదం. కానీ జిమ్‌లలో దీన్ని బాడీ బిల్డింగ్, శక్తి పెంచే ఉద్దేశంతో దుర్వినియోగంగా ఉపయోగిస్తున్నారని టీజీడీసీఏ డైరెక్టర్ షాహ్‌నవాజ్ ఖాసిమ్ చెప్పారు. డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి ప్రిస్క్రిప్షన్ ఔషధాలను విక్రయించడం లేదా వాడటం చట్టవిరుద్ధమని అధికారులు హెచ్చరించారు. అనుమతి లేకుండా ఔషధాలను నిల్వ ఉంచిన లేదా విక్రయించిన జిమ్‌లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు హెచ్చరించారు.
