Site icon vidhaatha

Bank Robbery । పోలీసులకు చిక్కిన రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంకు దోపిడీ దొంగల ముఠా

Bank Robbery । విధాత ప్రత్యేక ప్రతినిధి: గత నెల 18వ తేది అర్ధరాత్రి రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో దోపిడీకి పాల్పడిన ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు దొంగలను వరంగల్‌ పోలీసులు అరెస్టు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు పరారీలో వున్నారు. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు సుమారు ఒక కోటి ఎనభై లక్షల నాలుగువేల రూపాయల విలువ గల రెండు 2కిలోల 520 గ్రాముల బంగారు అభరణాలు, ఒక కారు, పదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన వారిలో అర్షాద్‌ అన్సారీ (34), షాఖీర్‌ఖాన్‌ ఆలియాస్‌ బోలెఖాన్‌ (28), హిమాన్షు బిగాం చండ్‌ జాన్వర్‌ (30) ఉన్నారు. మహమ్మద్‌ నవాబ్‌ హసన్‌ (39), అక్షయ్‌ గజానన్‌ అంబోర్‌ (24), సాగర్‌ భాస్కర్‌ గోర్‌ (32), సాజిద్‌ ఖాన్‌ (35) పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఈ అరెస్టు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వివరాలను వెల్లడించారు. పరారీలో వున్న ప్రధాన నిందితుడు మహమ్మద్‌ నవాబ్‌ హసన్‌ కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ నుండి వచ్చి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లోని బ్యాంక్‌లు, బ్యాంక్‌ భద్రత ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించాడు. అనంతరం ఉత్తర ప్రదేశ్‌, మహరాష్ట్రలకు చెందిన మిగిలిన నిందితులతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వ్యాపారం ముసుగులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ముఠా ముందుగా గుగూల్‌ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బ్యాంకుల సమాచారాన్ని సేకరించింది. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్‌బీఐ బ్యాంక్‌ చోరీకి అనువైనదిగా గుర్తించి అందులో చోరీకి సిద్ధపడ్డారు. నవంబర్‌ 18 తేదీ అర్ధరాత్రి (తెల్లవారితే19) నిందితులు హైదరాబాద్‌ నుండి నిందితుల్లో ఒకడైన హిమాష్షు డ్రైవింగ్‌ చేస్తున్న ఒక కారులో రాయపర్తి గ్రామ శివారు ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం కారును తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకు రమ్మని వెనక్కి తిప్పి పంపారు.

అనంతరం పంట పొలాల ద్వారా నిందితులు రాయపర్తి కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ దక్షిణ భాగానికి రాత్రి 11 గంటలకు చేరుకొని, అక్కడ వున్న కిటీకిని తొలగించి బ్యాంక్‌లోకి చొరబడ్డారు. ముందుగా బ్యాంక్‌ సెక్యూరీటీ అలారంతో పాటు, సీసీ కెమెరాల వైర్లను కట్‌ చేసి, ఇద్దరు నిందితులను తొలగించిన కిటీకి వద్ద కాపలాగా వుంచి ప్రధాన నిందితుడు సహా నలుగురు బ్యాంక్‌ స్ట్రాంగ్‌ రూం తాళాలు పగులగొట్టారు. స్ట్రాంగ్‌ రూంలో వున్న మూడు లాకర్లను గ్యాస్‌ కట్టర్లను వినియోగించి లాకర్లను కట్‌ చేసి అందులోవున్న సూమారు 13 కోట్ల 61 లక్షల రూపాయల విలువ గల బంగారు అభరణాలను వెంట తెచ్చుకున్న సంచుల్లో వేసుకొని పారిపోయారు. వెంట తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్‌, ఇతర సామగ్రిని బ్యాంక్‌లో వదిలి వేశారు. వెళ్ళే ముందు సీసీ కెమెరాల డివిఆర్‌ను ఎత్తుకుపోయారు. చోరీ అనంతరం నిందితులు వచ్చిన కారులో తిరిగి హైదరాబాద్‌లో కిరాయికి తీసుకున్న ఇంటికి చేరుకున్నారు. చోరీ సోత్తును ఏడు సమాన వాటాలు పంచుకున్నారు. నవంబర్‌ 19న నిందితులు మూడు బృందాలుగా వీడిపోయిన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు తిరిగివెళ్ళిపోయారు.

Exit mobile version