Site icon vidhaatha

Bengaluru’s Shraddha Walker। సున్నిత మనస్కులు ఈ వార్త చదవొద్దు.. 30 ముక్కలైన బెంగళూరు ‘శ్రద్ధావాకర్‌’ కేసులో సంచలన విషయాలు..

Bengaluru’s Shraddha Walker। ఢిల్లీలో దారుణ హత్యకు గురైన శ్రద్ధావాకర్‌ తరహాలో బెంగళూరులో హత్యకు గురైన మహాలక్ష్మిదాస్‌ (28) కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మాల్‌లో పనిచేసే మహాలక్ష్మి మృతదేహంలో కొన్ని భాగాలు (severed body parts) గురువారం సాయంత్రం ఆమె ఇంటిలోని ఫ్రిజ్‌లో కనిపించిన విషయం తెలిసిందే. హంతకుడు ఆమె శరీరాన్ని 30 ముక్కలుగా నరికివేసి, ఆమె ఇంటిలోని ఫ్రిజ్‌లోనే దాచిపెట్టాడు. చాలా రోజుల తర్వాత ఇంటి యజమాని ఫిర్యాదుతో ఈ దారుణ హత్యోదంతం వెలుగు చూసింది.

మహాలక్ష్మి దాస్‌ వ్యాలికావల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్లేశ్వరంలో ఉంటున్నది. అయితే.. కొద్ది రోజులుగా బయటి నుంచి తాళం వేసి ఉన్న ఇంటి నుంచి దుర్వాసన (stench) వస్తుండటంతో ఇరుగుపొరుగుకు అనుమానం వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులకు ఇంటి యజమాని సమాచారం ఇచ్చారు. ఆమె తల్లి, సోదరి వచ్చి ఇంటి తాళం బద్దలు కొట్టి చూడగా.. ఫ్రిజ్‌ నుంచి దుర్వాసన వస్తున్నట్టు గుర్తించారు. ఫ్రిజ్‌ తెరువగానే భయానక దృశ్యం కనిపించింది. అందులో శరీర భాగాలకు పురుగులు పట్టి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని చూసి వారు మూర్ఛపోయారు.

ఈ హత్య కేసును ఛేదించడానికి కొంత సమయం పడుతుందని బెంగళూరు పోలీసులు (Bengaluru Police) చెబుతున్నారు. మృతురాలి మొబైల్‌ ఫోన్‌ చాలా రోజుల నుంచి అందుబాటులో (unreachable) లేదు. ఒక వ్యక్తితో మహాలక్ష్మి తరచూ కనిపిస్తూ ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ కేసును పరిశీలిస్తే ఢిల్లీలో దారుణ హత్యకు గురైన శ్రద్ధావాకర్‌ (Shraddha Walker) కేసు గుర్తుకు వస్తున్నది. 2022లో శ్రద్ధావాకర్‌ను ఆమె ప్రియుడు అతిదారుణంగా హత్య చేసి, శరీర భాగాలను ఢిల్లీలోని వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు.

మహాలక్ష్మి దాస్‌ తల్లిదండ్రులు కొన్నిదశాబ్దాల క్రితమే నేపాల్‌ నుంచి బెంగళూరుకు వచ్చి, నేలమంగళలో స్థిరపడ్డారు. తన ఇంటికి సమీపంలోని ఒక మాల్‌(mall)లో మహాలక్ష్మి పనిచేస్తూ ఉండేది. వారాంతపు సెలవు రోజులు మినహాయిస్తే ప్రతి రోజూ ఉదయం తొమ్మిదిన్నరకు వెళ్తే.. రాత్రి పదిన్నరకు తిరిగి వచ్చేది. తన బిడ్డ భర్త వద్ద ఉంటుండటంతో మృతురాలు ఒంటరిగా జీవిస్తున్నదని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. ఐదు నెలల క్రితమే ఒకే గది ఉన్న ఇంటిలోకి మహాలక్ష్మి మారిందని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు.  మొదట్లో ఆమె సోదరుడు కూడా ఆమెతో ఉన్నా.. కొంతకాలం తర్వాత వెళ్లిపోయాడని తెలుస్తున్నది. మహాలక్ష్మి తన భర్త నుంచి వేరుపడి జీవిస్తున్నది. భర్త నేలమంగళలో తన బిడ్డతో కలిసి ఉంటున్నాడు. ఆమె తల్లిదండ్రులు ఆమె ఇంటికి కొద్ది దూరంలోనే ఉంటున్నారు. దీంతో ఇంటి యజమాని సమాచారం ఇచ్చిన వెంటనే కూతురు ఇంటికి వచ్చారు.

సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచే మహాలక్ష్మి సెల్‌ఫోన్‌ స్విచ్ ఆఫ్‌ వస్తున్నది. ఆమె కాల్ లిస్టును తనిఖీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. కొన్ని రోజులుగా ఫోన్‌ స్విచ్ ఆఫ్‌ అని వస్తున్నా సమీపంలోనే ఉండే తల్లిదండ్రులు విషయం తెలుసుకునేందుకు కూడా కూతురు ఇంటికి రాకపోవడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తొలుత కొద్ది రోజుల క్రితమే ఆమె హత్యకు గురయి ఉంటుందని పోలీసులు భావించినా.. ఆమె సెల్‌ఫోన్‌ స్విచ్ ఆఫ్‌ అయిన వెంటనే ఆమె హత్యకు గురై ఉంటుందని అనుమానిస్తున్నారు.

మహాలక్ష్మి ఇరుగుపొరుగువారితో పెద్ద కలివిడిగా ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఉదయం ఆమె మాల్‌కు బయల్దేరే ముందు పికప్‌ చేసుకుని, రాత్రి మళ్లీ దిగబెట్టేవాడని చెబుతున్నారు.  ఈ గుర్తు తెలియని వ్యక్తి ఎవరన్న విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను చంపిన అనంతరం మృతదేహం భాగాలను 165 లీటర్‌ సింగిల్‌ డోర్‌ ఫ్రిజ్‌లో కుక్కాడు. ఫ్రిజ్‌ ఆన్‌లోనే ఉన్నప్పటికీ.. వాటిని కనుగొనే సమయానికి కుళ్లిపోయి కనిపించాయి. నరికి ఉన్న తల ఫ్రిజ్‌లోపల అడుగు భాగంలో కనిపించింది. కాళ్లు పై భాగంలో కుక్కాడు. ఇతర శరీర భాగాలను మధ్యలో పెట్టాడు.

Exit mobile version