Vamana Rao couple Murder Case | తెలంగాణలో సంచలనం రేపిన గట్టు వామనరావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐ అప్పగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021 ఫిబ్రవరి 17న న్యాయవాదులైన వామనరావు దంపతులు రోడ్డుపైనే హత్యకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వీరిని దుండగులు హత్య చేశారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వామనరావు తండ్రి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. హత్యకు గురైన సమయంలో వామనరావు దంపతుల మరణ వాంగ్మూలం ఒరిజినలేనని ఫోరెన్సిక్ నివేదిక పేర్కొన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.
మరో వైపు ఈ విషయమై సీబీఐ దర్యాప్తునకు తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించడాన్ని వామనరావు తండ్రి స్వాగతించారు. సీబీఐ విచారణలో అసలు వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. మరో వైపు సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. లాయర్ వామనరావు దంపతుల కేసు విచారణ అప్పట్లో సరిగా జరగలేదని ఆయన అన్నారు.
వామనరావు దంపతుల హత్యలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై ఆరోపణలు
వామనరావు దంపతుల హత్య కేసులో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై బాధిత కుటుంబం అప్పట్లో ఆరోపణలు చేసింది. ఈ హత్య జరగడానికి కొన్ని రోజుల ముందే వామనరావు తనకు ప్రాణహాని ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. ఈ లేఖ రాసిన కొన్ని రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. శీలం రంగయ్య లాకప్ డెత్ కేసులో వామనరావు దంపతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ వాపస్ తీసుకోవాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించినట్టు అప్పట్లో ఆరోపించారు. వామనరావు తండ్రి ఫిర్యాదు మేరకు విచారించిన పోలీసులు అప్పట్లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును కూడా ప్రశ్నించారు. వారం రోజులు ఆయన అప్పట్లో కన్పించకుండా పోయారని ప్రచారం సాగింది. అయితే తాను ఎక్కడికి వెళ్లలేదని ఇక్కడే ఉన్నానని తనపై మీడియా తప్పుడు ప్రచారం చేసిందని మధు తనపై వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. ఈ కేసులో పుట్ట మధు బంధువు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీను అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ మంథని మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత శ్రీనుపై బీఆర్ఎస్ నాయకత్వం చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే వామనరావు దంపతుల కేసును హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారించింది. హైకోర్టు న్యాయవాదులు కూడా ఇది సుపారీ హత్యేనని అప్పట్లో ఆరోపించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
Montana Plane Crash | పార్కింగ్ విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం !
Army Truck | ట్రక్కు లోయలో పడి ఆర్మీ జవాన్ మృతి
Khazana Jewellery : చందానగర్ జ్యూవెలరీ షాపులో దోపిడీ దొంగల కాల్పులు..చోరీ