శుక్ర‌వారం మ‌హిళ‌లు త‌ల‌స్నానం చేయొచ్చా..? చేస్తే లాభ‌మా.. న‌ష్ట‌మా..?

  • Publish Date - April 5, 2024 / 06:30 AM IST

శుక్ర‌వారం వ‌స్తుందంటే చాలు ల‌క్ష్మీదేవిని కొలిచే భ‌క్తులు అప్ర‌మ‌త్త‌మ‌వుతారు. ల‌క్ష్మీదేవిని ఎంతో ప‌విత్రంగా పూజించేందుకు స‌ర్వం సిద్ధం చేసుకుంటారు. ల‌క్ష్మీదేవికి ఇష్ట‌మైన పూల నుంచి మొదలుకుంటే నైవేద్యం వ‌ర‌కు అన్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఆర్థిక క‌ష్టాల‌ను, దారిద్య్రాన్ని పార‌ద్రోలి.. అష్టైశ్వ‌రాలను ల‌క్ష్మీదేవి ప్ర‌సాదిస్తుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. అయితే ఎంతో ప‌విత్ర‌మైన శుక్ర‌వారం రోజున మహిళ‌లు ఈ ప‌నులు అస‌లు చేయ‌కూడ‌ద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి ఏ ప‌నులు చేయ‌కూడ‌దో తెలుసుకుందాం..

శుక్ర‌వారం త‌ల‌స్నానం చేయొచ్చా..?

శుక్ర‌వారం ల‌క్ష్మీదేవిని ఆరాధించే మ‌హిళ‌ల్లో చాలామంది తెలియ‌క త‌ల‌స్నానం చేస్తుంటారు. కానీ శుక్ర‌వారం త‌ల‌స్నానం చేయ‌డం మంచిది కాద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ రోజున త‌ల‌స్నానం చేస్తే ల‌క్ష్మీదేవికి కోపం వ‌చ్చి ఆ ఇంటిని విడిచి వెళ్లిపోతుంద‌ని శాస్త్రం చెబుతుంది. కాబ‌ట్టి మ‌హిళ‌లు గురువారం, బుధ‌వారం, ఆదివారం మాత్ర‌మే త‌ల‌స్నానం చేయాల‌ని సూచిస్తున్నారు.

శుక్ర‌వారం ఇల్లును నీటితో క‌డ‌గొచ్చా..?

ల‌క్ష్మీదేవి పూజ నేప‌థ్యంలో చాలా మంది శుక్ర‌వారం రోజు పొద్దున్నే నీటితో క‌డుగుతుంటారు. కానీ ఇలా చేయ‌డం మంచిది కాద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శుక్ర‌వారం ఇల్లు క‌డిగితే ల‌క్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంద‌ట‌. కాబ‌ట్టి గురువారం సాయంత్ర‌మే ఇల్లూవాకిళ్లు కడుక్కోవాల‌ని సూచిస్తున్నారు.. సాధారణంగా గురువారం సాయంత్రమే లక్ష్మీ దేవి ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి ఉంటుందో ఆ ఇంటికే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందట. అందుకే గురువారం సాయంత్రమే ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి.

శుక్ర‌వారం మాంసం తినొచ్చా..?

ఇక ఆహారం విష‌యానికి వ‌స్తే శుక్ర‌వారం రోజు ల‌క్ష్మీదేవిని పూజించే వారు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిద‌ని పండితులు చెబుతున్నారు. మ‌ద్యానికి కూడా దూరంగా ఉండాలట‌. మ‌ద్యం, మాంసం ఆ రోజున తీసుకుంటే ఆ ఇంట్లో పేద‌రికం త‌ప్ప‌ద‌ట‌. ఇక‌ ఆ రోజున గోళ్ల‌ను కూడా క‌త్తిరించ‌కూడ‌ద‌ట‌. మ‌హిళ‌లు గ‌డ‌ప‌లో నిల‌బ‌డి త‌ల కూడా దువ్వుకోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ఇక ఈ ప‌నులు కూడా త‌ప్ప‌క చేయాలి.. శుక్రవారం ఇంటి గడపను పసుపుకుంకుమలతో అలకరించాలి. మహిళలు పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకోవాలి. గోమాతను పూజించాలి. తులసి పూజ చేయాలి. బంగారం, వెండి, వజ్రవైడూర్యాలు శుక్రవారం కొంటే ఎంతో మంచిది. నూతన గృహాలు, పొలాలు, స్థలాలు కొనాలనుకునే వారు శుక్రవారం కొంటే మంచిది.

Latest News