Guru Purnima 2024 | తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పూర్ణిమ అని అంటారు. ఆషాఢ మాసంలో వచ్చి ఈ పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు గురు పూర్ణిమ రోజునే జన్మించారు. ఆయన నాలుగు వేదాలను రచించి ఈ భూమ్మీద ఉన్న సమస్త మానవాళికి జ్ఞానాన్ని అందించాడని విశ్వసిస్తారు. అందుకే వేద వ్యాసుడి జన్మదినం సందర్భంగా గురు పూర్ణిమ జరుపుకుంటారు హిందువులు. ఈ పవిత్రమైన రోజున వేద వ్యాస మహర్షితో పాటు గురువులను పూజిస్తారు. గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకుంటే.. జీవితంలో కచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయనేది నమ్మకం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో అయితే గురు స్థానం బలంగా ఉండదో వారు కూడు గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి గురు పూజకు శుభ ముహుర్తం ఎప్పుడు.. గురు పూర్ణిమ ప్రాముఖ్యత తెలుసుకుందాం..
జూలై 20(శనివారం)న సాయంత్రం 5:59 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 21 జూలై 2024 ఆదివారం మధ్యాహ్నం 3:46 గంటలకు పూర్ణిమ తిథి ముగుస్తుంది. తిథి ప్రకారం.. జూలై 21న ఆదివారం నాడు గురు పూర్ణిమ జరుపుకోవాలి. గురు పూర్ణిమ రోజున శుభ ముహుర్తం ఉదయం 9:01 గంటల నుంచి ఉదయం 10:44 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రెండో ముహుర్తం 10:44 నుంచి మధ్యాహ్నం 12:27 గంటల వరకు ఉంటుంది. అనంతరం చివరగా మధ్యాహ్నం 2:09 గంటల నుంచి మధ్యాహ్నం 3:52 గంటల వరకు ఉంటుంది.
హిందూ సంప్రదాయంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. గురువు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దాంతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు ప్రసరిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరి జీవితం ఎదుగుదలలో తల్లిదండ్రుల తర్వాత గురువుదే గొప్పస్థానంగా భావిస్తారు. గురువు అనుగ్రహం ఉన్నవారు తప్పకుండా జీవితంలో విజయం సాధించి తీరుతారు. కాబట్టి గురువులను ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరిస్తే జీవితంలో ఎంతో ఉన్నతస్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఇక బౌద్ధ మతంలోనూ బుద్ధుడు గురు పూర్ణిమ రోజున తన అనుచరులకు ఉపన్యాసం ఇచ్చారని పండితులు చెబుతారు.
గురు పూర్ణిమ వేళ సూర్యుడు ఉదయించక ముందే నిద్ర మేల్కొనాలి. అభ్యంగన స్నానం ఆచరించాలి.
వేద వ్యాస మహర్షిని పూజించాలి. ఇక తమకు ఇష్టమైన గురువుల వద్దకు వెళ్లి వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందండి. గురు పూర్ణిమ రోజున ఇలా చేయడం వల్ల ప్రతి రంగంలో పురోగతిని పొందుతారు. ఎందుకంటే గురువును సేవించడం ద్వారా జాతకంలో గురు దోషం తొలగిపోతుంది. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని విశ్వాసం. గురు పౌర్ణమి వేళ చంద్రుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం.
గురు పూర్ణిమ వేళ కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున శనగపప్పు, పసుపు మిఠాయిలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.