Balapur Laddu | వినాయక చవితి( Vinayaka Chavithi ) ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. శనివారం నాడు భక్తుల కొలహాలం మధ్య గణనాథులు గంగమ్మ ఒడికి చేరనున్నాయి. నిమజ్జన ప్రక్రియకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదంత పక్కన పెడితే.. అందరి దృష్టి మాత్రం.. బాలాపూర్ గణనాథుడి( Balapur Ganesh )పైనే ఉంది. ఎందుకంటే.. ఆ బాలపూర్ విఘ్నేశ్వరుడి లడ్డూ( Balapur Laddu )కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది కాబట్టి. ఈ లడ్డూనే వేలం పాటలో దక్కించుకునేందుకు ఒక్క తెలంగాణ( Telangana )కు చెందిన వారే కాదు.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) వారు పోటీ పడుతుంటారు. అంటే బాలాపూర్ గణేషుడి లడ్డూకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరోనా సమయంలో తప్ప గత 29 ఏండ్లుగా బాలాపూర్ లడ్డూ వేలం పాటలో ప్రత్యేకత చూపిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. గతేడాది అంటే 2024లో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ. 30,01,000 ధర పలికింది. అయితే రాయదుర్గంలోని మై హోమ్ భుజా( My Home Bhooja )లో నిన్న నిర్వహించిన వేలంలో గణనాథుడి లడ్డూ బాలాపూర్ లడ్డూ రికార్డులను బ్రేక్ చేసింది. మై హోమ్ భుజా లడ్డూను ఖమ్మం జిల్లాలోని ఇల్లెందుకు చెందిన కొండపల్లి గణేశ్ రూ. 51,77,777కు దక్కించుకున్నాడు. మరి మై హోమ్ భుజా లడ్డూ రికార్డును బాలాపూర్ గణనాథుడి లడ్డూ బ్రేక్ చేయనుందా..? అని భక్తులు చర్చించుకుంటున్నారు. మై హోమ్ భుజా లడ్డూ రికార్డును బాలాపూర్ లడ్డూ బ్రేక్ చేయనుందా..? లేదా..? అన్న విషయం తెలుసుకోవాలంటే రేపు ఉదయం వరకు ఊపిరి బిగపట్టాల్సిందే.
బాలాపూర్ గణనాథుడి లడ్డూ చరిత్ర ఇదే..
బాలాపూర్ గ్రామం.. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం సమీపంలో ఉంటుంది. బాలాపూర్‌లో జరిగే గణేశ్ ఉత్సవాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ వినాయకుడిని ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ గణనాథుడి లడ్డూ వేలం తొలిసారిగా 1994లో రూ. 450తో ప్రారంభమైంది. నేడు లక్షలకు చేరింది. ఇక ఈ లడ్డూను దక్కించుకునేందుకు పోటీ భారీగా ఉంటుంది. ప్రతి ఏడాది స్థానికులు, స్థానికేతరుల మధ్య వేలం పాట నువ్వా నేనా అన్నట్లు జరుగుతుంది.
బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నది వీరే..
1. కొలను మోహన్‌రెడ్డి(1994) – రూ. 450
2. కొలను మోహన్‌రెడ్డి(1995) – రూ. 4,500
3. కొలను కృష్ణా రెడ్డి(1996) – రూ. 18,000
4. కొలను కృష్ణా రెడ్డి(1997) – రూ. 28,000
5. కొలను మోహన్‌రెడ్డి(1998) – రూ. 51,000
6. కళ్లెం అంజి రెడ్డి (1999) – రూ. 65,000
7. కళ్లెం ప్రతాప్ రెడ్డి(2000) – రూ. 66,000
8. జీ రఘునందన్ చారి(2001) – రూ. 85,000
9. కందాడ మాధవ రెడ్డి(2002) – రూ. 1,05,000
10. చిగిరింత బాల రెడ్డి(2003) – రూ. 1,55,000
11. కొలను మోహన్‌రెడ్డి(2004) – రూ. 2,01,000
12. ఇబ్రామ్ శేఖర్(2005) – రూ. 2,08,000
13. చిగిరింత తిరుపతి రెడ్డి(2006) – రూ. 3,00,000
14. జీ రఘునందన్ చారి(2007) – రూ. 4,15,000
15. కొలను మోహన్‌రెడ్డి(2008) – రూ. 5,07,000
16. సరిత(2009) – రూ. 5,10,000
17. కొడాలి శ్రీధర్ బాబు(2010) – రూ. 5,35,000
18. కొలను బ్రదర్స్(2011) – రూ. 5,45,000
19. పన్నాల గోవర్ధన్ రెడ్డి(2012) – రూ. 7,50,000
20. తీగల కృష్ణా రెడ్డి(2013) – రూ. 9,26,000
21. సింగిరెడ్డి జైహింద్ రెడ్డి(2014) – రూ. 9,50,000
22. కళ్లెం మదన్ మోహన్ రెడ్డి(2015) – రూ. 10,32,000
23. కందాడి స్కైలాబ్ రెడ్డి(2016) – రూ. 14,65,000
24. నాగం తిరుపతి రెడ్డి(2017) – రూ. 15,60,000
25. తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్(2018) – రూ. 16,60,000
26. కొలను రామ్ రెడ్డి(2019) – రూ. 17,60,000
27. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్(2020) – కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు, కేసీఆర్‌కు అందించారు.
28. రమేశ్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి(2021) – రూ. 18,90,000
29. వంగేటి లక్ష్మా రెడ్డి(2022) – రూ. 24,60,000
30. దాసరి దయానంద రెడ్డి(2023) – రూ. 27,00,000
31. కొలను శంకర్ రెడ్డి(2024) – రూ. 30,01,000