ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న వారు అయితే కచ్చితంగా తమ ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటుంటారు. ప్రతి రోజు తులసి మొక్కకు పూజ చేసి.. లక్ష్మీ కటాక్షం కోసం ప్రార్థిస్తుంటారు. అయితే తులసి మొక్కలు ప్రతి ఇంటి ముందుండే వాకిట్లో పెరిగేవి. ఇప్పుడంతా అపార్ట్‌మెంట్ సంస్కృతి మొదలైంది. కాబట్టి ఏ దిశలో తులసి మొక్కను ఉంచి పూజిస్తే లాభం జరుగుతుంది. అలానే తులసి మొక్కను ఏ వారాల్లో కోయాలి. మంగళవారం కోస్తే ఏమవుతుందో తెలుసుకుందాం..
ఇంటి ఇల్లాలు ప్రతి రోజు స్నానం ఆచరించిన తర్వాత తులసి కోట వద్ద దీపారాధన చేస్తే మంచిది. సూర్యోపాసన తర్వాత తులసి మొక్కు నీరు పోయాలని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. శ్రీ మహా విష్ణువు తులసి ప్రియుడు. కాబట్టి ప్రతి రోజు విష్ణుమూర్తికి తులసి దళం సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే మంగళ, శుక్రవారాల్లో తులసి మొక్కను కోయొద్దని సూచిస్తున్నారు. ఆ రెండు రోజులు తులసి మొక్కను కోసి దేవుడిని ఆరాధిస్తే.. దరిద్రం వెంటాడుతుందట. కాబట్టి మిగిలిన రోజుల్లో తులసి దళాలను కోసి పూజలో సమర్పించొచ్చు. మన ఇంట్లో దేవుని పూజ కోసం వాడే తులసిని మనం నిత్యం పూజ చేసే తులసి కోటలో తులసి మొక్క నుంచి సేకరించకూడదు. అలా చేస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది. పూజ కోసం ప్రత్యేకంగా వేరొక ప్రదేశంలో కానీ, కుండీలో కానీ తులసిని పెంచి ఆ మొక్క నుంచి మాత్రమే పూజ కోసం తులసి దళాలు సేకరించాలి.
తులసి ఏ దిశన ఉండాలి..?
ఇక తులసి మొక్కను ఇంటి బాల్కనీ ఎటు వైపు ఉంటే.. ఆ ప్రదేశంలో వాయువ్యం వైపు పెంచుకోవాలి. అక్కడే తులసి మొక్క కుండీని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి కటాక్షిస్తుంది. కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకుంటే మంచిది.
తులసిలో ఎన్నో ఔషధ గుణాలు..
ఇంటి ఆవరణలో తులసి వనం ఏర్పాటు చేసుకుంటే మంచిది.ఈ తులసి వనం మీద నుంచి వచ్చే గాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తలనొప్పి, గొంతు నొప్పి జలుబుతో బాధపడే వారు తులసి ఆకులు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.