ఇంట్లో మ‌ట్టి కుండ‌ను ఏ దిశ‌లో పెడుతున్నారు..? ఈ దిశ‌లో పెడితే ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

  • Publish Date - April 3, 2024 / 06:13 AM IST

ఎండాకాలంలో ప్ర‌తి ఒక్క‌రూ మ‌ట్టితో త‌యారు చేసిన కుండ‌ల‌ను వినియోగిస్తారు. ఎందుకంటే మ‌ట్టి కుండ‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డంతో.. శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. దాహం కూడా తీరుతుంది. మ‌న‌సుకు కూడా ఎంతో ఉల్లాసం ఉంటుంది. కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రూ ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో మ‌ట్టి కుండ‌ల‌ను ఇంట్లో పెడుతుంటారు. అయితే ఈ మ‌ట్టి కుండ‌ను స‌రైన దిశ‌లో పెడితే ల‌క్ష్మీదేవి క‌టాక్షిస్తుంద‌ని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. మ‌రి ఇంట్లో మ‌ట్టి కుండ‌ను ఏ దిశ‌లో ఉంచాలో తెలుసుకుందాం..

మ‌ట్టి కుండ‌ను ఏ దిశ‌లో ఉంచాలంటే.. ఇంట్లో కానీ, కార్యాల‌యాల్లో కానీ మ‌ట్టి కుండ‌ను ఉత్త‌ర దిశ‌లో పెడితే మంచిద‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఉత్త‌ర దిశ‌లో నీటికి సంబంధించిన వ‌స్తువులు ఉంచితే శుభ ఫ‌లితాలు క‌లుగుతాయ‌ని న‌మ్మ‌కం. ఈ దిశ‌లో మ‌ట్టి కుండ‌ను ఉంచ‌డం వ‌ల్ల వ‌రుణ దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయ‌ని సూచిస్తున్నారు. ఆ ఇంట్లో ఎవ‌రూ కూడా అనారోగ్యం బారిన ప‌డ‌ర‌ని చెబుతున్నారు. ఇక కుటుంబంలోని ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోయి.. ల‌క్ష్మీదేవీ క‌టాక్షిస్తుంద‌ని పండితుల న‌మ్మ‌కం.

రాత్రి స‌మ‌యాల్లో కుండ‌ను ఖాళీగా ఉంచొద్దు.. నీరు, మ‌ట్టి.. ఈ రెండు కూడా సంప‌ద‌తో ముడిప‌డి ఉంటాయి. కాబ‌ట్టి కుండ‌ను ఖాళీగా ఉంచ‌కుండా, నీటితో నింపి ఉంచాల‌ని చెబుతున్నారు. రాత్రి స‌మ‌యాల్లో కుండ‌ను ఖాళీగా ఉంచ‌డం అశుభం అని పేర్కొంటున్నారు. మ‌రి ముఖ్యంగా కొత్త మట్టి కుండ‌లో నీటిని మొద‌ట చిన్న‌పిల్ల‌ల‌కు గానీ, ఆడ‌పిల్ల‌ల‌కు గానీ తాగిస్తే ల‌క్ష్మీదేవి సంతోషిస్తుంద‌ట‌. ముఖ్యంగా వంటగదిలో మట్టి కుండను ఉంచినట్లయితే దానిని స్టవ్ కు దూరంగా పెట్టండి. ఎందుకంటే అగ్ని, నీరు పక్కపక్కనే ఉండకూడదు.

Latest News