Site icon vidhaatha

హ‌నుమంతుడు వివాహితుడేనా..? మ‌రి సంతానం మాటేమిటి..? పురాణాలు ఏం చెబుతున్నాయంటే..?

ఆంజనేయుడు బ్రహ్మచారులకు ఆరాధ్య దైవం.. ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి.. బ్రహ్మచారులకు ఆదర్శం హనుమంతుడు. ఆంజ‌నేయుడి పాత్ర ప్ర‌ధానంగా క‌నిపించే రామాయ‌ణంలో ఆయ‌న పెళ్లి ప్ర‌స్తావ‌నే లేదు. రామాయణంలో తీవ్రమైన బ్రహ్మచర్యాన్ని అవలంభించిన హ‌నుమంతుడికి పరాశర సంహిత వంటి కొన్ని పురాణాలు మాత్రం ఆంజ‌నేయుడికి పెళ్లైన‌ట్లు పేర్కొన్నాయి.

ప‌రాశ‌ర సంహిత పురాణం ప్ర‌కారం.. హ‌నుమంతుడు సూర్యుడినే త‌న గురువుగా ఆరాధించాడు. ఒక న‌వ వ్యాక‌ర‌ణం త‌ప్ప సూర్యుడి నుంచి ఆంజ‌నేయుడు స‌క‌ల విద్య‌లు, వేదాలు నేర్చుకున్నాడు. ఇక గృహ‌స్తుల‌కే అర్హ‌మైన న‌వ వ్యాక‌ర‌ణాన్ని హ‌నుమంతుడు నేర్చుకోలేక‌పోతాడు. ఎందుకంటే ఆంజ‌నేయుడు బ్ర‌హ్మ‌చారి కాబ‌ట్టి. ఈ విద్యాభ్యాసం పూర్తి కావాలంటే హ‌నుమంతుడు త‌ప్ప‌కుండా వివాహం చేసుకోవాల్సిందే. దీంతో సూర్యుడు త్రిమూర్తుల సూచ‌న మేర‌కు త‌న కిర‌ణాల కాంతితో సువ‌ర్చ‌ల దేవి అనే ఓ దేవ క‌న్య‌ను సృష్టించాడు.

ఈ సువ‌ర్చ‌ల దేవి యోని ద్వారా జ‌న్మించ‌ని యువ‌తి. ఆమెను వివాహం చేసుకోవాల‌ని సూర్యుడు ఆదేశించ‌గా, హ‌నుమంతుడు నిరాక‌రిస్తాడు. తాను ఆజన్మ బ్రహ్మచారిని కాబట్టి, తన ప్రతిఙ్ఞకు భంగం కలుగుతుందని సంశయం వ్యక్తం చేశాడు. గురుదక్షిణ కింద తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపిస్తాడు. అంతేకాదు సువర్చల దేవ కన్య.. ఆమెను వివాహం చేసుకున్నా నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు. ఇది లోక కల్యాణం కోసమే జరుగుతున్న కార్యమని సూర్యుడు ఆంజ‌నేయుడిని ఒప్పిస్తాడు. వివాహం అయిన మరుక్షణమే సూర్య పుత్రిక తపస్సుకు ఉపక్రమించింది. అలా సువర్చలాదేవితో హనుమంతుడికి వివాహం అయిందని పురాణాల్లో పేర్కొన్నారు.

ఆంజ‌నేయుడి సంతానం క‌థ ఇదీ..

ఆంజ‌నేయుడి పెళ్లి క‌థ ఇలా ఉంటే.. ఆయ‌న సంతానం క‌థ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ సంతానం క‌థ ఏంటంటే.. సూర్యుడి కోరిక మేర‌కు సువ‌ర్చ‌ల దేవిని వివాహం చేసుకున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న బ్ర‌హ్మ‌చ‌ర్య దీక్ష‌ను వదిలిపెట్ట‌లేద‌ట‌. అయితే లంకా న‌గ‌రంలో సీతాదేవిని అన్వేషించ‌డానికి ఆంజ‌నేయుడు వెళ్లిన‌ప్పుడు రావ‌ణుడు ఆయ‌న తోక‌కు నిప్పంటించాడు. ఆ నిప్పుతో లంక‌ను హ‌నుమంతుడు కాల్చేశాడు. ఆ త‌ర్వాత స‌ముద్రంలో త‌న తోక‌కు అంటిని నిప్పును ఆర్పేస్తాడు. ఆ స‌మ‌యంలో స‌ముద్రంపై వెళ్తుండ‌గా, హ‌నుమంతుడి చెమ‌ట బిందువును చేప మింగింద‌ట‌. తద్వారా చేప పుత్ర సంతానాన్ని పొందింద‌ట‌. ఆ పుత్రుడి పేరు మ‌క‌ర ధ్వ‌జుడు. ఈ మకరధ్వజుడు పెరిగి పెద్దవాడై, మైరావణుడి(రావ‌ణాసురుడి మేన‌మామ‌) ప్రాణాలకు కాపలా ఉన్నాడట. మైరావణుడి ప్రాణాలను హరించటానికి వచ్చిన ఆంజనేయుడు కుమారుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందిట. యుద్ధం తరువాత వాస్తవం తెలుసుకుని కుమారుణ్ణి ఆశీర్వదించి ఆంజ‌నేయుడి ఆ యుద్ధ క్షేత్రం నిష్క్ర‌మించిన‌ట్లు పురాణాలు పేర్కొన్నాయి.

ఖ‌మ్మం జిల్లాలో సువ‌ర్చ‌ల దేవి ఆల‌యం..

దక్షిణ భారత దేశంలో సువర్చలదేవి పేరుతో ఈమె పూజలందుకుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని పందిళ్లపల్లిలో ఉంది. ఈ ఆలయాన్ని దర్శించినవారికి ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వైవాహిక జీవితం సాగుతుందని భ‌క్తుల న‌మ్మ‌కం.

Exit mobile version