Lord Hanuman | హిందువులు మంగళవారం వచ్చిందంటే.. హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. వీలైతే హనుమాన్ ఆలయాలకు వెళ్లి ప్రదక్షిణలు చేసి, హనుమాన్ చాలీసా పఠించి కోరికలు కోరుకుంటారు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు.. ఆయా రంగాల్లో అదృష్టం కూడా కలిసే వచ్చే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆంజనేయుడి గుడికి వెళ్లి ఈ మంత్రం జపిస్తే మరి ముఖ్యంగా వ్యాపారంలో లాభం పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పరీక్షల్లో విజయం సాధించడం, ఉద్యోగంలో పదోన్నతి లభించడం వంటివి జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు. మరి మంగళవారం జపించాల్సిన ఆ మహత్తరమైనటువంటి మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మంగళవారం హనుమంతుడిని స్మరిస్తూ జపించాల్సిన మంత్రం ఇదే..
ఆంజనేయం మహావీరం!
బ్రహ్మ విష్ణు శివాత్మకం!
అరుణార్కం ప్రభుం శమథం
రామదూతం నమామ్యహం!
పై మంత్రాన్ని ఆంజనేయుడి గుడిలో పఠించాలి. హనుమంతుడి చుట్టూ మొత్తం 11 ప్రదక్షిణలు చేసి ఈ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడంతో ఆంజనేయస్వామి కృపాకటాక్షాలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన ఈ మంత్రం కారణంగా మీరు వివిధ రంగాల్లో విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడే వారు కూడా ఈ మంత్రాన్ని జపిస్తే ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా భూతప్రేత పిశాచాల నుంచి కూడా ఈ మంత్రం చదవడంతో ముప్పు తొలగిపోతుంది. ఒక వేళ శని ప్రభావంతో బాధపడుతున్నట్లయితే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించడంతో శని ప్రభావం నుంచి బయటపడొచ్చు.