Durga Temple | విజయవాడ (Vijayawada) దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం (Durga Malleswara Swamy Temple)లో అక్టోబర్ 3వ తేదీ నుంచి శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు 12వ తేదీ విజయ దశమితో ముగియనున్నాయి. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శరన్నవరాత్రులను సమయంలో భక్తులందరికీ అమ్మవారి దర్శనం కలిగేలా.. ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నది. ఇక ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో తొలిరోజైన 3న బాలత్రిపుర సుందరీగా దుర్గమ్మ కటాక్షించనున్నది. 4న గాయత్రీ దేవిగా, 5న అన్నాపూర్ణాదేవిగా, 6న లలితా త్రిపుర సుందరీదేవిగా అనుగ్రహించనున్నారు.
7న మహా చండీదేవిగా, 8న మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తారు. మాలానక్షత్రం సందర్భంగా 9న చదువుల తల్లి సరస్వతీదేవిగా అమ్మవారు కటాక్షిస్తారు. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన 10న దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవిగా, చివరి రోజైన 11న విజయ దశమి రోజున మహిషాసుర మర్దినీగా దర్శన భాగ్యం కల్పించనున్నారు. 12న రాజరాజేశ్వరి దేవిగా అనుగ్రహిస్తారు. ఈ సారి శరన్నవరాత్రుల సమయంలో భారీగా రద్దీ ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్మంగా మూలానక్షత్రమైన అక్టోబర్ 9న రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు.. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎండలు ఎక్కువగా ఉన్నా.. వర్షాలు కురిసినా ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో తాగునీటితో పాటు పాలు, అల్పాహారం అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఇక నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్లతో పాటు దర్శన సమయాలతో పాటు ఇతర వివరాలన్నీ అందులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఆన్‌లైన్ టికెట్లు లేకుండా వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రిసెప్షన్, టోల్‌గేట్, హోం టర్నింగ్, పున్నమి ఘాట్, వీఎంసీ ఆఫీస్, కలెక్టర్ కార్యాలయం, బస్టాండ్, రైల్వేస్టేషన్ల వద్ద కరెంట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రభుత్వం తరఫున దుర్గా మల్లేశ్వరస్వామి వారలకు ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మూలానక్షత్రం రోజున పట్టువస్త్రాలను సమర్పిస్తారని అధికారులు తెలిపారు. ఇక ఉత్సవాలకు 3500 మంది పోలీసులతో భద్రతను కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.