Kedarnath | కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్దామనుకుంటున్నారా..? మరి రిజిస్ట్రేషన్‌ ఎప్పటి నుంచో తెలుసా..?

  • Publish Date - April 8, 2024 / 08:30 AM IST

Kedarnath | హిందూమతంలో ఛార్‌ధామ్‌ యాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. చాలా మంది భారతీయులు జీవితంలో ఒకసారైనా యాత్రకు వెళ్లాలని భావిస్తుంటారు. ఛార్‌ధామ్‌ యాత్రలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయంలో మే నెలలో తెరుచుకోబోతున్నది. ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆలయ ద్వారాలు తెరుచుకోనుండగా.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకోనున్నారు. ఈ ఏడాది మే 10న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు తెరువనున్నారు. ఉత్తరాఖండ్‌లోని మంచుకొండల మధ్య కొలువైన ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులు మొదట తమ పేర్లను వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. యాత్ర గౌరీకుంఢ్‌ నుంచి కేదార్‌నాథ్‌ వరకు కాలినడకన సాగుతుంది. నడవలేని స్థితిలో ఉన్న వారు హెలికాప్టర్‌ సైతం బుక్‌ చేసుకునే వీలుంటుంది. కాలినడకన దాదాపు 16 కిలో మీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది.

అయితే, ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటయో చెప్పలేని పరిస్థితి. క్షణాల్లోనే వాతావరణమంతా మారిపోతూ ఉంటుంది. అయితే, హెలికాప్టర్‌ కోసం డబ్బులు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. కాలినడకన ప్రయాణం చేయలేని వారి కోసం డోలీలు అందుబాటులో ఉంటాయి. ఇక కేదార్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఈ నెల 12న ప్రారంభం కానున్నది. ఈ వెళ్లాలనుకునే వారంతా వాతావరణ పరిస్థితులను బట్టి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే మేలు. ముఖ్యంగా శారీరంగా దృఢంగా ఉండాలి. యాత్రకు వెళ్లేవారు లగేజీని కూడా వెంట పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున స్వెట్టర్లు వెంట తీసుకువెళ్లాలి. అలాగే కీలకమైన ధ్రువీకరపత్రాలు వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దు, ఆధార్‌, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లెసెన్సుల్లో ఏదో ఒకటైనా వెంట తీసుకు వెళ్లాలి.

Latest News