Site icon vidhaatha

TTD | తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

TTD | తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులతో పాటు ఇంటర్‌, పది పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. అలాగే, లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో తిరుమలకు భక్తుల తాడికి పెరిగింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ అధికంగా ఉంటున్నది. దాంతో స్వామి దర్శనానికి సుమారు 30 నుంచి 40 గంటల వరకు సమయం పడుతున్నది.

అంటే క్యూలైన్లలోనే భక్తులు రెండు రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు జూన్‌ 30 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అప్పటి వరకు సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో మార్చి నెలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది.

ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు అనుమతి ఇవ్వాలని ఈసీని టీటీడీ కోరింది. దాంతో ఎన్నికల కమిషన్‌ సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 21న బ్రేక్‌ దర్శనాలను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సర్వదర్శనం కోసం టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు అన్నీ నిండిపోయాయి.

Exit mobile version