Woman Marriage | హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజు ఏదో ఒక దేవుడిని భక్తులు పూజిస్తూనే ఉంటారు. పూజల సందర్భంగా భక్తులు దేవుళ్లను అనేక కోరికలు కోరుకుంటుంటారు. ఒక వేళ కోరికలు నెరవేరితే నేరుగా ఆయా ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. అయితే గురువారం శ్రీ మహా విష్ణువుకు, బృహస్పతికి అంకితం చేశారు. ఈ రోజు శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేసి, ఆరాధించిన తర్వాత అరటి చెట్టుకు పూజ చేసే ఆచారం ఉంది. హిందూ ఆచారాల ప్రకారం, బృహస్పతి అరటి చెట్టులో నివసిస్తాడని విశ్వసిస్తారు.
అయితే గురువారం అరటి చెట్టును పూజిస్తే.. దేవతల గురువు బృహస్పతితో పాటు శ్రీమహావిష్ణువు సంతోషిస్తారని, తద్వారా భక్తుల ప్రతి కోరికను నెరవేరుస్తారని విశ్వాసం. సంపద, జ్ఞానం, గౌరవం, కీర్తి ప్రతిష్ఠలతో పాటు అనేక ఫలితాలు లభిస్తాయని నమ్మకం. పెళ్లి ఆలస్యం అవుతున్న లేదా తగిన భర్త దొరకని యువతులు గురువారం నాడు వ్రతాన్ని ఆచరించి అరటి చెట్టును పూజిస్తే వారికి అతి త్వరలో వివాహం జరగడమే కాకుండా ఉత్తమ జీవిత భాగస్వామి కూడా లభిస్తాడని విశ్వాసం. మరి అరటి చెట్టును ఎలా పూజించాలో తెలుసుకుందాం..
అరటి చెట్టును ఎలా పూజించాలంటే..?
గురువారం తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఇక పసుపు రంగు బట్టలు ధరించాలి. ఇంట్లో ఈశాన్య స్థానంలో శ్రీ మహా విష్ణువు పటాన్ని ప్రతిష్ఠించి, పూజ చేయాలి. అనంతరం అరటి చెట్టుకు పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు అరటిచెట్టుకు పసుపు, శనగపప్పు, బెల్లం, అక్షత, పూలు సమర్పించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించి, హారతి ఇచ్చి, అరటిపండు నివేదన చేయాలి. దీపం వెలిగించిన తర్వాత అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, కోరికలు తీర్చమని శ్రీమహా విష్ణువును ప్రార్థించాలి. ఇంట్లో అరటి చెట్టు పెట్టి పూజ చేయకూడదని గుర్తుంచుకోండి. ఇంటి బయట లేదా గుడిలో చెట్టు ఉంటే అక్కడ పూజలు చేయడం ద్వారా త్వరగా ఫలితం ఉంటుంది.