Tholi Ekadashi | ఆషాఢ మాసం వచ్చే శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సనాతన ధర్మంలో తొలి ఏకాదశి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దక్షిణాయంలో వచ్చే పండుగను తొలి ఏకాదశి అంటారు. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి జారుకుంటారు. ఈ సందర్భాన్ని తొలి ఏకాదశి పండుగగా పిలుస్తారు.
ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకం ఉంది. అంతేకాకుండా శుభఫలితాలను పొందేందుకు ఉపవాసం ఉంటారు. తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢమాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకు వెళ్లాడని.. కార్తీకమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం. అంతేకాదు తొలి ఏకాదశి నుంచి హిందువుల పండగలు ప్రారంభం అవుతాయని విశ్వాసం. అయితే తొలి ఏకాదశిని ఈ ఏడాది ఏ రోజున జరుపుకోవాలనేది గందరగోళంగా మారింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం..
తొలి ఏకాదశి ఎప్పుడంటే..?
హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి తిథి జూలై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది. తిథి ప్రకారం.. ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, నియమ నిష్ఠలతో విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం.
ఏకాదశి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది..?
ఇక తొలి ఏకాదశిని గొప్ప పండుగగా హిందువులు చేస్తారు. ఆ రోజున తెల్లవారుజామునే నిద్ర మేల్కొని తలస్నానం చేస్తారు. ఇల్లును శుభ్రంగా కడుగుతారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో మునిగిపోతాయరు. శ్రీహరికి నైవేద్యం సమర్పిస్తారు. నైవేద్యంలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి. కొందరు ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఏకాదశి పర్వదినం నాడు పసుపు రంగు దుస్తులు ధరించాలి. అంతేకాకుండా ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేస్తే కూడా మంచిది.
ఏకాదశి నాడు ఈ పనులు అసలు చేయకూడదు..
ఏకాదశి రోజున తామసిక ఆహారం అసలు తీసుకోకూడదు. పొరపాటును కూడా అన్నం భుజించొద్దు. స్త్రీలను, పెద్దలను అవమానించేలా మాట్లాడకూడదు. ఉపవాసం ఉన్న ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు.