Ganesh Immersion | గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి శుభ ముహుర్తం ఇదే..! 11వ రోజే ఎందుకు నిమ‌జ్జ‌నం చేస్తారో తెలుసా..?

Ganesh Immersion | వినాయ‌క చ‌వితి( Vinayaka Chavithi ) ఉత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. మ‌రో ఐదు రోజుల్లో నిమ‌జ్జ‌నం( Ganesh Immersion ). అంటే వినాయ‌క చ‌వితి ప్రారంభ‌మై 11 రోజులు పూర్త‌వుతుంది కాబ‌ట్టి. మ‌రి వినాయ‌కుడి నిమ‌జ్జ‌నానికి శుభ ముహుర్తం ఎప్పుడు బాగుంది.. అస‌లు 11వ రోజే ఎందుకు నిమ‌జ్జ‌నం చేస్తారో తెలుసుకుందాం.

Ganesh Immersion | శ్రావ‌ణ మాసం ముగిసిన త‌ర్వాత ఆరంభ‌మైన భాద్ర‌ప‌ద శుద్ధ చవితి రోజున వినాయ‌క చ‌వితి ( Vinayaka Chavithi )ని జ‌రుపుకుంటాం. అదే రోజు మండ‌పాల్లో గ‌ణనాథులు కొలువుతీరారు. 11 రోజుల పాటు పూజ‌లందుకున్న త‌ర్వాత భాద్ర‌ప‌ద శుద్ధ చ‌తుర్ద‌శి రోజున గ‌ణ‌నాథుడు గంగ‌మ్మ ఒడికి చేరుకుంటారు. అయితే వినాయక నిమజ్జనానికి( Ganesh Immersion ) అత్యంత ముఖ్యమైన రోజు మాత్రం 11…. ఎందుకంటే భాద్రపద మాసం( Bhadrapada Masam )లో పౌర్ణమి ముందు వచ్చే అనంత చతుర్థశి అత్యంత విశిష్టమైనరోజు. ఈ తిథి చవితి రోజు నుంచి సరిగ్గా 11వ రోజు వస్తుంది.. అందుకే వినాయక నిమజ్జనం పదకొండోరోజు ఆచరిస్తారు. ప్ర‌తి ఏడాది ఈ తిథిని ఆధారంగా చేసుకునే నిమ‌జ్జ‌నం ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తారు. సంకష్టహర చతుర్థి వ్రతానికి ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్ద‌శి ముఖ్యం అయితే.. చవితి పూజలందుకునే గణపయ్య నిమజ్జనానికి పౌర్ణమి ముందు వచ్చే చతుర్ద‌శిని ప్రధానంగా పరిగణన‌లోకి తీసుకుంటారు.

గ‌ణేశుడి నిమ‌జ్జ‌నానికి శుభ స‌మ‌యం ఇదే..

ఈ ఏడాది భాద్ర‌ప‌ద శుద్ధ చ‌తుర్ద‌శి.. సెప్టెంబ‌ర్ 16వ తేదీన మ‌ధ్యాహ్నం 1.13 నిమిషాల‌కు ప్రారంభం కానుంది. ఆ చ‌తుర్ద‌శి ముగింపు ఘ‌డియ‌లు సెప్టెంబ‌ర్ 17 ఉద‌యం 11.08 నిమిషాల‌కు ముగియ‌నున్నాయి. సెప్టెంబరు 17 మంగళవారం ఉదయం 8.18 నుంచి 9.05…తిరిగి రాత్రి 10.44 నుంచి 11.31 గంట‌ల వ‌ర‌కు దుర్ముహూర్తం ఉన్నది. సెప్టెంబరు 17 మంగళవారం రాత్రి 8.31 నుంచి 10.01 వరకు వ‌ర్జ్యం ఉంది.

అందుకే ఈ ఏడాది వినాయక నిమజ్జనం సెప్టెంబరు 17 మంగళవారం వచ్చింది. మండపాల నుంచి గణనాథుడు బయటకు అడుగుపెట్టే ఘడియలే ప్రధానం..ఆ తర్వాత నిమజ్జనం అనేది ఆయా నగరాల్లో శోభాయాత్ర, భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వర్జ్యం, దుర్ముహూర్తం ఉన్న సమయంలో మండపంలోంచి వినాయకుడిని కదిలించరు.. అలా చేస్తే నిమజ్జనానికి ఆటంకాలు వస్తాయని భక్తుల విశ్వాసం.. అందుకే వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసుకుని చతుర్థశి ఘడియలు మించిపోకుండా నిమజ్జనానికి తరలిస్తే మంచిద‌ని పండితులు సూచిస్తున్నారు. నిమజ్జనం తర్వాత గణేషుడు తన తల్లిదండ్రులైన పరమేశ్వరుడు పార్వతిదేవి దగ్గరకు కైలాస పర్వతానికి వెళతాడని భక్తుల విశ్వాసం. అందుకే గణపయ్య ఆగమనం కన్నా వీడ్కోలు అంత సంబరంగా జరుగుతుంది.