Site icon vidhaatha

Engineering fee | వచ్చే విద్యా సంవత్సరం నుంచి పెరగనున్న ఇంజినీరింగ్‌ ఫీజులు.. ఇతర కోర్సులకు కూడా..!

Engineering fee : రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్‌తోపాటు ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ తదితర ఉన్నత విద్యా కోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. మూడేళ్లకు ఒకసారి తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (TAFRC) రుసుములను సమీక్షించి కొత్త ఫీజులను ఖరారు చేస్తుంది. ఈ మేరకు 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు కమిటీ సిఫార్సుల మేరకు 2022 జులైలో కొత్త ఫీజులను నిర్ణయించింది. ఆ రుసుములు ఈ 2024-25 విద్యా సంవత్సరం వరకే వర్తిస్తాయి. కాబట్టి 2025-26 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాల్సి ఉంది.

ఈ క్రమంలో టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఏ గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరిత, జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ఆచార్య కే వెంకటేశ్వరరావు, ఓయూ రిజిస్ట్రార్‌ ఆచార్య లక్ష్మీనారాయణ తదితరులు సోమవారం సమావేశమై కొత్త మార్గదర్శకాలపై చర్చించారు. ఈ నెలాఖరుకు టీఏఎఫ్‌ఆర్‌సీ నుంచి నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఆగస్టు తొలి లేదా రెండో వారం నుంచి కళాశాలల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది.

ఆయా కళాశాలలు గత రెండుమూడేళ్లుగా విద్యా సంవత్సరాల ఆదాయ, వ్యయాలను కమిటీకి సమర్పించాల్సి ఉంది. అనంతరం ఆయా కళాశాలల ప్రతినిధులను పిలిచి ప్రాథమికంగా నిర్ణయించిన ఫీజును తెలియజేస్తారు. ఏమైనా అభ్యంతరాలు చెబితే వాటిని పరిగణనలోకి తీసుకొని రుసుమును ఖరారు చేస్తారు. ఆ ఫీజుల వివరాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదానికి పంపిస్తారు. అనంతరం ప్రభుత్వం జీవో జారీచేస్తే కొత్త రుసుములు అమల్లోకి వస్తాయి. సాధారణంగా ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రారంభానికి ఒకట్రెండు రోజుల ముందుగా ఈ జీవోను జారీ చేస్తుంటారు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌కు గరిష్ఠంగా రూ.1.60 లక్షలు, కనిష్ఠంగా రూ.35 వేల ఫీజును నిర్ణయించారు.

పాలిటెక్నిక్‌ కోర్సులకూ ఫీజుల పెంపు..

పాలిటెక్నిక్‌ కోర్సులకు గత దశాబ్దకాలంగా ఫీజులు పెంచలేదని, ఫీజులు పెంచాలని కోరుతూ గత విద్యా సంవత్సరంలో పలు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దాంతో పాలిటెక్నిక్‌ ఫీజులను కూడా TAFRC నే నిర్ణయించాలని న్యాయస్థానం ఆదేశించింది. అప్పటివరకు రూ.40 వేల ఫీజు వసూలుకు కూడా అంగీకరించింది. అయితే రుసుములు ఖరారు చేయాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కమిటీ మిన్నకుండిపోయింది. దాంతో హైకోర్టుకు వెళ్లిన పలు కళాశాలలు ఈసారి కూడా రూ.40 వేలు తీసుకుంటున్నాయి. అయితే కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్లో మాత్రం అన్ని ప్రైవేట్‌ కళాశాలలకు రూ.15,780 మాత్రమే ఫీజు ఉన్నట్లు చూపుతున్నారు. మిగిలిన మొత్తాన్ని ఆయా కళాశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి.

Exit mobile version