Site icon vidhaatha

Inter Supply Exams | ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు..

Inter Supply Exams : తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. అందుకు సంబంధించిన నూతన షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ముందుగా మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇప్పుడు షెడ్యూల్‌ను మార్చి.. మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

మే 27న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. సప్లిమెంటరీలో ఫస్టియర్, సెకండియర్‌ పరీక్షలు ఒకే రోజున నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఇంటర్‌ మార్కుల జాబితాను ఏప్రిల్ 25న సాయంత్రం నుంచే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన బోర్డు.. ఆ మార్కులపై సందేహాలుంటే 10 రోజుల్లోగా రీ కౌంటింగ్‌కు, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం పేపర్‌కు రూ.600 చెల్లించి గురువారం నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Exit mobile version