Mana Shankara Vara Prasad Garu Review: Chiranjeevi Shines in a Family Entertainer | Vidhaatha Review
విధాత వినోదం డెస్క్ | హైదరాబాద్:
మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదలైన పెద్ద సినిమాల్లో ఒకటి. భారీ అంచనాలు, సూపర్ హిట్ సంగీతం, గత విజయాల బలం, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ… ఇవన్నీ కలిసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అయితే, సినిమా ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంది?
కథ – నవరసాలతో నడిచే కుటుంబ నాటకం
శంకర వరప్రసాద్ (చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. వృత్తిలో కఠినంగా, పనిలో నిబద్ధతగా ఉన్న ఆయన, వ్యక్తిగత జీవితంలో మాత్రం భార్య శశిరేఖ (నయనతార)తో అపార్థాల వల్ల విడిపోతాడు. పిల్లలకు దూరమై ఆరు సంవత్సరాలు గడిస్తాయి. ఈ బాధను గమనించిన కేంద్రమంత్రి (శరత్ సక్సేనా), వరప్రసాద్‌ను పిల్లలు చదువుతున్న బోర్డింగ్ స్కూల్‌కు పీఈటీగా పంపిస్తాడు. అక్కడ అతను వారితో ఎలా దగ్గరయ్యాడు? దూరమయ్యేలా చేసిన అపార్థానికి అసలు కారణం ఏమిటి? ఈ సమయంలో శశిరేఖ జీవితంలోకి వస్తున్న వెంకీ గౌడ (వెంకటేశ్) ఎవరు? ఈ కుటుంబ కథలోకి చేరే క్రిమినల్ ట్రాక్ ఎలాంటి మలుపుకు తీసుకెళ్తుంది? ఇవన్నీ మిగిలిన కథ.
చిరంజీవిని చూస్తే సంతోషంగా ఉంది : వన్ మ్యాన్ షో
ఈ చిత్రానికి ప్రధాన బలం ఎవరంటే నిస్సందేహంగా చిరంజీవే. రీఎంట్రీ తర్వాత ఇంత సరదాగా, తేలికగా నటించిన చిత్రం ఇదే అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత తనదైన కామెడీ టైమింగ్, చిన్న చిన్న హావభావాలు, పిల్లలతో సన్నివేశాల్లో కనపడే సహజత్వం – ఇవన్నీ కలిపి ఆయన పర్ఫార్మెన్స్‌ని విభిన్నంగా నిలబెట్టాయి. చిరంజీవి చాలా కూల్‌గా నటించారంటే అతిశయోక్తి కాదు.
నయనతార శశిరేఖగా ఆకట్టుకున్నారు. చిరు–నయన్ కెమిస్ట్రీ తెరపై మృదువుగా, అతికినట్లు కనిపించింది. రెండో అర్థ భాగంలోకి ప్రవేశించిన వెంకటేశ్ పాత్ర చిన్నదే అయినా, ఆయన రాక కొత్త ఉత్సాహం తెచ్చింది. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టాడు. జరీనా వహాబ్–నయనతార మధ్య ఘర్షణ సీన్ భావోద్వేగాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. కేథరిన్, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడ్కర్ వంటి నటులు తమ పాత్రల పరిధిలో బాగా నటించారు. విరోధుల సన్నివేశాలు కొంత బలహీనంగా ఉన్నప్పటికీ, మిగతా కథనం వల్ల ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడలేదు.
సాంకేతిక బలాబలాలు – సంగీతం సగం బలం
భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ సినిమాకు కీలకమైన ఆకర్షణ. “శిశిరేఖా..” మరియు “మీసాల పిల్ల..” పాటల చిత్రీకరణ, కథను ముందుకు నడిపించే విధానం – రెండూ బాగా కుదిరాయి. నేపథ్య సంగీతం కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మరింత బలంగా ఉంటే బావుండేది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ రంగులతొ, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బోర్డింగ్ స్కూల్ ఎపిసోడ్స్ మరియు పాటలలోని విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎడిటింగ్ తొలి భాగంలో వేగంగా ఉన్నప్పటికీ, రెండో భాగంలో కొద్దిపాటి సాగదీత స్పష్టంగా కనిపిస్తుంది.
దర్శకుడు అనిల్ రావిపూడి తన పాత ఫార్ములా పద్ధతినే మరోసారి ఉపయోగించారు — లాజిక్ తగ్గించి, మ్యాజిక్‌ను పెంచడం. ప్రతి పది నిమిషాలకు ఓ కామెడీ బీట్, కుటుంబసంబంధిత ఎమోషన్, సెలబ్రేట్ చేసే సాంగ్స్… ఇలా మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ తరహాలో రూపకల్పన చేసారు. అయితే కథలో కొత్తదనం పెద్దగా కనిపించకపోవడం, విలన్ ట్రాక్ బలహీనంగా ఉండటం, వెంకటేశ్ ఎపిసోడ్‌కు తగిన తీవ్రత లేకుండాపోవడం వంటి లోపాలు కొద్దిగా భావం చూపాయి.
పండక్కి సరైన వినోదంతో వచ్చారు
‘మన శంకర వరప్రసాద్ గారు’ని తార్కికంగా కాకుండా, సరదాగా చూడాల్సిన సినిమా. చిరంజీవి నటన, అనిల్ రావిపూడి టచ్‌లో ఉండే వినోదాత్మక సన్నివేశాలు, భీమ్స్ పాటలు… ఇవన్నీ కలిసి కుటుంబంతో చూడగల నిజమైన పండగ సినిమా రూపంలో నిలబెట్టాయి. కథలో ప్రత్యేకత లేకపోయినా, చిరంజీవి ప్రెజెన్స్ సినిమాను ముందుకు నడిపిస్తుంది.
విధాత రేటింగ్: 3/5
