విధాత : సూపర్ స్టార్ మహేశ్ బాబు-రాజమౌళి కలయికలో వస్తున్న ‘వారణాసి’ సినిమాపై మేకర్స్ వదులుతున్న ఆప్డేట్స్ తో రోజురోజుకు భారీ అంచనాలు పెరుగుతున్నాయి. యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాపై ఒక ఆసక్తికరమైన మ్యూజిక్ అప్‌డేట్ షేర్ చేశారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న కీరవాణి ‘వారణాసి’ సినిమా పాటలపై ఆసక్తికర అంశం వెల్లడించారు. 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాదాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నది సమాచారం. సినిమాలో కథ..కథనం..సన్నివేశాల చిత్రీకరణ, విఎఫ్ ఎక్స్ వర్క్స్ తో పాటు సంగీతం కూడా ప్రధానాకర్షణగా ఉండబోతుందని కీరవాణి తెలిపారు.
వారణాసిలో ఆరుపాటలు
వారణాసి సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని కీరవాణి వెల్లడించారు. అభిమానులు ఊహించని రేంజ్‌లో మ్యూజిక్ వింటారని తెలిపారు. అలాగే తాను ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా పూర్తిగా క్లియర్‌గా ఉన్నానని చెప్పారు. మనకు చేసే పనిపై నమ్మకం ఉంటే ఒత్తిడి అనేది ఉండదన్నారు. వారణాసి విషయంలో కూడా నాకు 100శాతం క్లారిటీ ఉంది అని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘రణ కుంభ’ ఆడియో సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. రాజమౌళి – కీరవాణి కాంబినేషన్ సినిమాల సక్సెస్ లలో పాటలు, సంగీతం కూడా కీలకంగా ఉన్నాయి. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ పాటలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధనతో ప్రత్యేక గుర్తింపు సాధించడం విశేషం.
