Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లతో దూసుకుపోతోంది. పెయిడ్ ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు కలిపి ఈ సినిమా ఇప్పటికే రూ.59 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. రెండో రోజు కూడా మంచి వసూళ్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బుక్‌మైషోలో టికెట్ బుకింగ్‌లు ఇప్పటికీ బలంగా కొనసాగుతున్నాయి. ఒక దశలో గంటకు 15 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం సినిమాపై ఉన్న భారీ క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆదివారం కలెక్షన్లు రెండో రోజు కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
బాలయ్య క్విక్ ఆన్సర్..
రీసెంట్‌గా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ ఎమోషనల్‌గా స్పందించారు. చరిత్రలో చాలామంది ఉంటారు. కానీ చరిత్రను సృష్టించేది, మళ్లీ తిరగరాసేది ఒక్కరే. బాలయ్యకు ఇంత పొగరు ఎందుకు అంటారా? నన్ను చూసుకునే నాకు ఆ పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఉర్రూతలూగించాయి. సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ మాత్రం అంచనాలను మించిపోతున్నాయి. భక్తిరసంతో కూడిన యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తమన్ అందించిన పవర్‌ఫుల్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది.
ఇటీవల కాలంలో బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతుండగా, ‘అఖండ 2’లో అఘోరా పాత్రతో ప్రేక్షకులకు మరోసారి ప్రత్యేక అనుభూతిని అందించాడు. సినిమాలోని యాక్షన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. కొంతమంది ఈ చిత్రాన్ని హిందూత్వ ఎజెండా సినిమాగా అభివర్ణిస్తూ విమర్శలు చేసినా, దర్శకుడు సినిమాలో కేవలం ఒక మతానికే పరిమితం కాకుండా భారతదేశ ఐక్యత, సమగ్రత అంశాలను కూడా బలంగా చూపించినట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా, ‘అఖండ 2: తాండవం’ కలెక్షన్ల పరంగా మాత్రమే కాదు, ప్రభావం పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
