Deepika-Ranvir | స్టార్ హీరోలు తమ పర్సనల్ లైఫ్ గురించి చెప్పడానికి ఏ మాత్రం ఇష్టపడరు. అయితే బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ మాత్రం ఈ రూల్‌కు మినహాయింపు. మొదటిసారిగా తమ మధ్య ప్రేమ ఎలా మొదలైందో స్వయంగా వెల్లడించారు రణ్‌వీర్ సింగ్. 6 ఏళ్లు ప్రేమలో ఉండి, 2018లో వివాహం చేసుకున్న రణ్‌వీర్–దీపిక జంటకు 2024లో కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. కానీ వీరి ప్రేమ ఎప్పుడు మొదలైంది? ఈ ప్రశ్న అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉంది. రణ్‌వీర్ తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రేమకథ పుట్టిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు.
2013లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘గోలియోన్ కీ రాస్ లీలా – రామ్ లీలా’ సినిమా షూటింగ్ సమయంలోనే తమ ప్రేమ మొదలైందని రణ్‌వీర్ పేర్కొన్నారు. గుజరాత్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. రామ్ పాత్రలో రణ్‌వీర్, లీలా పాత్రలో దీపిక నటించిన ఈ చిత్రం, వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్‌స్క్రీన్ బంధాన్ని కూడా బలపరిచింది.
ఉదయ్‌పూర్‌లో ప్రేమ చిగురించిన రోజులు
ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన నేత్ర మంటెనా సంగీత్ వేడుకలో రణ్‌వీర్ ప్రత్యేకంగా మాట్లాడారు. “ఉదయ్‌పూర్ లవ్ స్టోరీలకు లక్ష్మీ స్వరూపం. అక్కడే రామ్ లీలా షూటింగ్ జరిగింది. మీ ‘బాబీ’తో అక్కడ కలిసి నటించాను. అదే షెడ్యూల్‌లో మా ప్రేమకథ మొదలైంది. ఉదయ్‌పూర్ నాకు లక్ష్మిలాంటి భార్యను ఇచ్చింది” అని చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు.
రణ్‌వీర్‌తో కొత్త ఆరంభం
దీపికా పదుకొణె గతంలో ప్రేమలో విఫలమై తీవ్ర మనోవేదనలో పడింది. తనే స్వయంగా ఇంటర్వ్యూల్లో డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనల వరకు వెళ్లిన రోజులను చెప్పుకుంది. అలాంటి సమయంలో రణ్‌వీర్ జీవితంలోకి రావడం, ఇద్దరి మధ్య బలమైన అనుబంధం పెరగడం వారి జీవితం మొత్తం మార్చేసింది.
మరో మూడు హిట్లతో ప్రేమ మరింత బలపడింది
‘రామ్ లీలా’ తర్వాత ‘బాజీరావ్ మస్తానీ’ (2015), ‘పద్మావత్’ (2018) సినిమాల్లోనూ ఈ జంట కలిసి నటించారు. ఈ మూడు చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఓ లెవెల్‌లో శాసించాయి. ప్రేక్షకులు ప్రేమించిన ఈ ఆన్‌స్క్రీన్ జంట చివరకు రియల్ లైఫ్ పార్ట్నర్స్‌గా మారి 2018లో లేక్ కోమోలో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు.
2024లో కూతురు, కొత్త జీవితం
2024లో వీరికి కూతురు జన్మించింది. ఆమెకు ‘దువా పదుకొణ్ సింగ్’ అని పేరు పెట్టారు. ఈ దీపావళి సందర్భంగా దువా ఫేస్‌ను మొదటిసారి సోషల్ మీడియాలో పంచుకున్నారు. పెళ్లి తర్వాత కూడా రణ్‌వీర్–దీపికా సినిమాలతో బిజీగా ఉంటూనే, తమ కుటుంబ జీవితాన్ని అందంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. మరోసారి ఈ స్టార్ జంట స్క్రీన్ మీద కలసి కనిపిస్తే అభిమానులకు పండగే.
