Pawan Kalyan |ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో చేపట్టనున్న రూ.35.19 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సనాతన ధర్మాన్ని నమ్మే వారంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఘన స్వాగతం, ప్రత్యేక పూజలు
పవన్ కల్యాణ్‌కు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని తన ఇలవేల్పుగా భావిస్తానని, తనకు ఇక్కడే పునర్జన్మ లభించిందని గతంలో పలుమార్లు చెప్పిన పవన్, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరిన పవన్, నాచుపల్లి జేఎన్‌టీయూ కళాశాల వద్ద దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకున్నారు.
భక్తుల సౌకర్యాలే లక్ష్యం
గతంలో కొండగట్టు ఆలయానికి వచ్చిన సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలయ పాలక మండలి సభ్యులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడంతో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామితో ఈ క్షేత్రానికి గట్టి అనుబంధం ఉందని వివరించారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి, మౌలిక సదుపాయాల కొరత ఉందని తెలిపారు.
టీటీడీ నుంచి రూ.35.19 కోట్ల నిధులు
ఈ సమస్యలపై పవన్ కల్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడితో చర్చించారు. దాని ఫలితంగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.35.19 కోట్ల నిధులు కేటాయించేందుకు టీటీడీ అంగీకరించింది. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు పవన్ ఈ పర్యటనలో భూమిపూజ చేశారు.
ధర్మశాల, మండపం నిర్మాణం
అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఉండేందుకు 96 గదులతో కూడిన ధర్మశాల నిర్మించనున్నారు. అలాగే సుమారు రెండు వేల మంది దీక్షలు విరమించేందుకు వీలుగా సువిశాల మండపం ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.
పవన్ కల్యాణ్ పిలుపు
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి కేవలం భక్తితో మాత్రమే సంబంధించింది కాదు… అది సామాజిక సమగ్రతకు ప్రతీక. కొండగట్టు లాంటి పవిత్ర క్షేత్రాల అభివృద్ధికి సనాతన వాదులంతా ముందుకు రావాలి అని అన్నారు. ఆంజనేయ స్వామి అందరి దేవుడని, ఆయన సేవ చేసుకునే అవకాశం తనకు దక్కడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. కొండగట్టు గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సాకారం చేద్దాం అని పిలుపునిచ్చారు. “రామభక్తులు అనుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. కొండగట్టు స్థానం అంత శక్తిమంతమైంది… తెలంగాణకు పూర్తి రక్షణగా నిలుస్తుంది. గిరి ప్రదక్షిణ పనులకు మీరు ముందడుగు వేయండి, నేను స్వయంగా వచ్చి కరసేవ చేస్తాను అని అన్నారు.
కొండగట్టు నాకు పునర్జన్మను ఇచ్చింది. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు’ అని అన్నారు
