Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, రాజకీయ ఆలోచనలు, సినీ ప్రయాణం, కాశ్మీర్ అనుభవాలు వంటి అనేక ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా తన అసలు పేరు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నా అసలు పేరు పవన్ కళ్యాణ్ కాదు
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ “మిమ్మల్ని పవన్ అని పిలవాలా? కళ్యాణ్ అని పిలవాలా? ఈ పేరు ఎలా వచ్చింది?” అని ప్రశ్నించగా పవన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నా అసలు పేరు పవన్ కళ్యాణ్ కాదు. నాకు తిరుమలలో పేరు పెట్టారు. నా పూర్తి పేరు శ్రీ కళ్యాణ్ కుమార్. తర్వాత స్కూల్ రికార్డుల్లో ‘శ్రీ’ తొలగిపోయి కే. కళ్యాణ్ కుమార్‌గా మారింది అని తెలిపారు. అయితే తర్వాత తన మార్షల్ ఆర్ట్స్ గురువు ‘పవన్’ అనే పదాన్ని పేరుకు జోడించారని వెల్లడించారు.
హనుమంతుడి పేరుతో వచ్చిన ‘పవన్’
మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో తాను కఠినమైన ప్రదర్శనలు చేసేవాడినని పవన్ గుర్తు చేసుకున్నారు. ఛాతిపై భారీ బండరాళ్లు పెట్టుకుని వాటిని పగలగొట్టించే స్టంట్స్ చేసేవాడిని. నా ప్రదర్శనలు చూసిన గురువు నువ్వు పవనసుతుడు హనుమంతుడిలా ఉన్నావని చెప్పి ‘పవన్’ అనే పేరును జోడించారు. అలా పవన్ కళ్యాణ్ అనే పేరు ఏర్పడింది” అని వివరించారు. ఇప్పటికే కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ పేరు వెనుక ఉన్న కథ తెలుసుకుని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు నక్సలైట్ కావాలనుకున్నా
ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన టీనేజ్ రోజులను కూడా గుర్తు చేసుకున్నారు. సమాజంలో కనిపించే అసమానతలు, పేదరికం, అన్యాయాలు తనను తీవ్రంగా కలచివేశాయని చెప్పారు. ఒక దశలో వ్యవస్థపై ఉన్న అసంతృప్తి కారణంగా అడవుల్లోకి వెళ్లి నక్సలైట్ ఉద్యమంలో చేరాలని కూడా ఆలోచించినట్లు వెల్లడించారు.
“టీనేజ్ చివరి రోజుల్లో సమాజంలో ఉన్న అసమానతలు చూసి చాలా బాధపడ్డాను. ఒక దశలో తుపాకీ పట్టుకుని అడవుల్లోకి వెళ్లి నక్సలైట్ కావాలనిపించింది” అని పవన్ పేర్కొన్నారు.
మోదీతో ఉన్న అనుబంధంపై స్పందన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న అనుబంధం గురించి కూడా పవన్ మాట్లాడారు. మోదీ గారు నాతో ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతారు. దేశాభివృద్ధి, జాతీయ ప్రయోజనాల గురించే మా చర్చలు సాగుతాయి. దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకువెళ్లే నాయకత్వం ఆయనది అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
‘ధురంధర్’, ‘బారాముల్లా’ సినిమాలపై ప్రశంసలు
ఇటీవల విడుదలవుతున్న జాతీయవాద, దేశభక్తి నేపథ్య చిత్రాల గురించి అడగగా పవన్ సానుకూలంగా స్పందించారు. ‘ధురంధర్’ సినిమా తనకు బాగా నచ్చిందని, ముఖ్యంగా సినిమా మేకింగ్, కథ చెప్పిన విధానం ఆకట్టుకున్నాయని చెప్పారు. అలాగే ‘బారాముల్లా’ చిత్రం కూడా తనను బలంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు.
కాశ్మీర్ పండితుల సమస్యలు, తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన కథ చాలా ప్రభావవంతంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పాడ్‌కాస్ట్‌లో పవన్ కళ్యాణ్ తన పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల నుంచి రాజకీయాలు, సామాజిక సమస్యలు, కాశ్మీర్ అనుభవాలు, ఇష్టమైన సినిమాల వరకు అనేక అంశాలపై మనసు విప్పి మాట్లాడారు.
