Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేయగా.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ దేశవ్యాప్తంగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.

ఇప్పటికే భోపాల్, బెంగళూరు నగరాల్లో సందడి చేసిన ‘పెద్ది’ టీమ్.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, నటులు దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ పాల్గొని సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

‘పెద్ది’ గురించి మోదీ అడిగారు: రామ్ చరణ్

ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన రామ్ చరణ్.. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన ప్రత్యేక భేటీని గుర్తుచేసుకున్నారు. “నేను ఒకసారి ప్రధాని మోదీని కలిసినప్పుడు.. ‘పెద్ది’ సినిమా కథ ఏంటి అని ఆయన అడిగారు. నేను ఈ సినిమా వికసిత్ భారత్ ఆలోచనను ప్రతిబింబించే కథ అని చెప్పాను” అని చరణ్ తెలిపారు.

అంతేకాదు.. ఆ సమయంలో ప్రధాని మోదీ తనకు ఒక స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత కథ చెప్పారని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన మహ్మద్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ దేశం తరఫున ఆడి.. తన గ్రామానికి ఎలా గుర్తింపు తీసుకొచ్చాడో మోదీ వివరించారని చెప్పారు.

“ఆ ఒక్క వ్యక్తి వల్ల ఇప్పుడు ఆ గ్రామం నుంచి 85 మందికి పైగా క్రీడాకారులు తయారయ్యారు. సమాజంలో ఒక వ్యక్తి ఎంతటి మార్పు తీసుకురాగలడో ఆ కథ చెబుతుంది. ‘పెద్ది’లో నా పాత్ర కూడా అలాంటి స్ఫూర్తితోనే సాగుతుంది” అని రామ్ చరణ్ తెలిపారు.

డ్యాన్స్‌పై చరణ్ ఫన్నీ కామెంట్

ఈ సందర్భంగా సినిమాలోని డ్యాన్స్ గురించి అడగ్గా.. రామ్ చరణ్ తనదైన స్టైల్లో సరదాగా స్పందించారు. “నిర్మాత మంచి పారితోషికం ఇచ్చారు” అంటూ నవ్వులు పూయించారు. చరణ్ చేసిన ఈ కామెంట్‌తో ప్రెస్‌మీట్‌లో ఒక్కసారిగా నవ్వులు వెల్లువెత్తాయి.

చరణ్ చాలా కూల్: జాన్వీ కపూర్

హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. “తెరపై కనిపించే రామ్ చరణ్‌కు, బయట ఉండే చరణ్‌కు చాలా తేడా ఉంటుంది. బయట ఆయన చాలా కూల్‌గా, ప్రశాంతంగా ఉంటారు” అని చెప్పారు.

అలాగే సీనియర్ నటుడు బొమన్ ఇరానీతో కలిసి నటించడం తనకు ఎప్పటి నుంచో కల అని, అది ‘పెద్ది’తో నెరవేరిందని జాన్వీ ఆనందం వ్యక్తం చేశారు.

బుచ్చిబాబు విజన్‌పై ప్రశంసలు

దర్శకుడు బుచ్చిబాబు సానా గురించి కూడా జాన్వీ ప్రత్యేకంగా మాట్లాడారు. “బుచ్చిబాబు గారి విజన్‌ను నేను పూర్తిగా నమ్మాను. ఆయన చెప్పిన విధంగానే నటించాను. ఇప్పుడు మా టీమ్ అంతా ఆయనకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయాం” అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు.

భారీ అంచనాల మధ్య ‘పెద్ది’

1980ల గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రమోషన్స్‌తో ‘పెద్ది’పై హైప్ మరింత పెరుగుతోంది.