Pooja Hegde | టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం అవకాశాల పరంగా కాస్త వెనుకబడ్డ పరిస్థితిలో ఉన్న పూజా హెగ్డే, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పూజా హెగ్డే మాట్లాడుతూ… గత కొన్ని నెలల క్రితం తాను ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటించానని, ఆ సినిమా షూటింగ్ సమయంలో తనకు తీవ్ర అసౌకర్యం కలిగించే సంఘటన ఒకటి జరిగిందని వెల్లడించింది. “ఒక రోజు షూటింగ్ బ్రేక్ సమయంలో నేను నా కారవాన్‌లో ఉన్నాను. ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఓ స్టార్ హీరో నా కేరావాన్‌లోకి వచ్చాడు.
ఒక్కసారిగా అతడిని చూసి నేను షాక్‌కు గురయ్యాను. కనీసం అడగకుండా లోపలికి రావడం నన్ను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేసింది” అని పూజా హెగ్డే చెప్పింది.అంతేకాదు, విషయం అక్కడితో ఆగలేదని ఆమె తెలిపింది. “అతడు బయటకు వెళ్లకుండా, నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రవర్తన పూర్తిగా అసభ్యంగా అనిపించింది. దాంతో నేను ఆలోచించకుండా అతడికి చెంపదెబ్బ కొట్టాను” అని పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఘటన తర్వాత పరిస్థితి మరింత చేదుగా మారిందని ఆమె చెప్పింది. “నేను కొట్టిన దెబ్బకు అతడు చాలా కోపంగా మారిపోయాడు. ఆ రోజు నుంచి నాతో మాట్లాడడం మానేశాడు. అంతేకాదు, ఆ సినిమాలో మిగిలిన సీన్స్‌ను నాతో చేయడానికి కూడా అతడు ఇష్టపడలేదు. నా స్థానంలో డూప్‌ని పెట్టి షూట్ చేయించాడు” అని పూజా హెగ్డే వెల్లడించింది.
ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెటిజన్లు ‘ఇంతకీ పూజా హెగ్డేతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ హీరో ఎవరు?’ అంటూ ప్రశ్నలు వేస్తూ, రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. కొందరు అభిమానులు కొన్ని స్టార్ హీరోల పేర్లను కామెంట్ల రూపంలో ప్రస్తావిస్తూ ఆరా తీస్తున్నారు.
అయితే, ఆ హీరో పేరు ఏమిటన్నది పూజా హెగ్డే స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం. దీంతో ఇది నిజంగా ఎవరి గురించి అన్నదానిపై స్పష్టత లేకపోయినా, ఆమె ఆరోపణలు మాత్రం సినీ పరిశ్రమలో మహిళా నటులు ఎదుర్కొనే ఇబ్బందులపై మరోసారి చర్చను తెరపైకి తీసుకొచ్చాయి. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో, పూజా హెగ్డే మరిన్ని వివరాలు వెల్లడిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
