Raghava Lawrence | రాఘవ లారెన్స్ రాజకీయ ప్రకటన వాయిదా.. భారతీరాజా మరణానికి నివాళిగా కీలక నిర్ణయం

Raghava Lawrence | ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ రంగ ప్రవేశంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తన జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఇటీవల ప్రకటించిన లారెన్స్, తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చారు.

Raghava Lawrence

Raghava Lawrence | ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ రంగ ప్రవేశంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తన జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఇటీవల ప్రకటించిన లారెన్స్, తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చారు.

ప్రత్యేకంగా తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో లారెన్స్ ప్రకటించబోయే నిర్ణయం ఏమిటనే ఆసక్తి అభిమానులు, రాజకీయ విశ్లేషకుల్లో నెలకొంది.

భార‌తీరాజా మ‌ర‌ణంతో వాయిదా..

మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 11 ఉదయం 9:30 గంటలకు ఈ కీలక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణించడంతో పరిస్థితులు మారిపోయాయి. దక్షిణ భారత సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు పొందిన భారతీరాజా మరణం చిత్రసీమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

ఈ నేపథ్యంలో భారతీరాజాపై ఉన్న గౌరవాన్ని చాటుతూ తన ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు రాఘవ లారెన్స్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్‌లో, “నా జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు గతంలో తెలియజేశాను. కానీ ప్రస్తుతం భారతీరాజా సర్ మరణంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో ఉంది. నేను కూడా నా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధను అనుభవిస్తున్నాను. ఆయనకు నివాళిగా నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాను” అని పేర్కొన్నారు.

జూన్ 12న ప్ర‌క‌ట‌న‌..

లారెన్స్ చేసిన ఈ ప్రకటనకు అభిమానుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. వ్యక్తిగతంగా ఎంతో ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా ఒక రోజు వాయిదా వేసి భారతీరాజాకు గౌరవం తెలిపిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు తాజా షెడ్యూల్ ప్రకారం రాఘవ లారెన్స్ తన భవిష్యత్ రాజకీయ ప్రస్థానం లేదా ఇతర కీలక కార్యాచరణకు సంబంధించిన ప్రకటనను జూన్ 12 ఉదయం 10 గంటలకు వెల్లడించనున్నారు. దీంతో ఆయన నిజంగానే రాజకీయాల్లోకి రాబోతున్నారా? లేక మరో కీలక సామాజిక కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నారా? అనే అంశాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.

మరి రాఘవ లారెన్స్ ప్రకటించబోయే ఆ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుందా లేదా అన్నది తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.

Latest News