Raja Saab | ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా విడుదలకు ముందు తెలంగాణలో టికెట్ రేట్లు, ప్రీమియర్ షోల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం (జనవరి 9) సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, గురువారం (జనవరి 8) సాయంత్రం వరకు టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవో విడుదల కాకపోవడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. సాయంత్రం చీకటి పడే సమయానికి అయినా జీవో వస్తుందని, రాత్రి ప్రీమియర్ షోలు పడతాయని ప్రభాస్ అభిమానులు ఆశించారు. కానీ రాత్రి 7 గంటల వరకూ ఎలాంటి అధికారిక సమాచారం రాకపోవడంతో ప్రీమియర్ షోలు ఉండవన్న భావన బలపడింది.
అయితే అనూహ్యంగా అదే గురువారం రాత్రి తెలంగాణలో కొన్ని మల్టీప్లెక్స్‌లలో ‘ది రాజాసాబ్’ ప్రీమియర్ షోలు పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఈ ప్రీమియర్ షోల టికెట్ ధరలు అభిమానులకు మరింత షాక్ ఇచ్చాయి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ టికెట్ల ధరలు రూ.600 నుంచి రూ.1000 వరకు ఉంటున్న ఈ రోజుల్లో, ‘ది రాజాసాబ్’ ప్రీమియర్ షో టికెట్ కేవలం రూ.300కే విక్రయించబడింది.
ఈ ప్రీమియర్ షోల గురించి ప్రభాస్ టీమ్ గానీ, చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గానీ ముందుగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ అపర్ణ సినిమాస్ నల్లగండ్లతో పాటు మరో కొన్ని మల్టీప్లెక్స్‌లలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. థియేటర్ కౌంటర్ల వద్ద రూ.300కే టికెట్లు అమ్మడం అభిమానులకు ఊహించని అదృష్టంగా మారింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రీమియర్ టికెట్ ధరలు దాదాపు రూ.1000 వరకు ఉండటం గమనార్హం.
గురువారం రాత్రి ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు నిజంగా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే శుక్రవారం ఉదయం నుంచి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవో అమల్లోకి వచ్చింది. దాంతో మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు రూ.450కి చేరాయి. బుక్‌మైషో వంటి ఆన్‌లైన్ యాప్‌ల ఛార్జీలు కలిపితే ఒక్క టికెట్ ధర దాదాపు రూ.500 వరకు అవుతోంది.
లేటుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ ‘ది రాజాసాబ్’ టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. కొన్ని గంటల్లోనే చాలా షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రస్తుతం థియేటర్ కౌంటర్ల వద్ద టికెట్లు దొరకడం కష్టంగా మారగా, ఎక్కువగా ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారానే సీట్లు నిండిపోతున్నాయి. మొత్తం మీద విడుదలకు ముందే ‘ది రాజాసాబ్’ టికెట్ రేట్లు, ప్రీమియర్ షోలు తెలంగాణలో ప్రత్యేక చర్చకు దారి తీసాయి.
