Super Food : ఆధునిక కాలంలో కొత్తగా వినిపిస్తున్న పేరు సూపర్ ఫుడ్స్! బెర్రీలు, నట్స్, ఆకుకూరలవంటివి సూపర్ ఫుడ్స్ జాబితాలో టాప్‌లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు వాటికి కొత్తగా మరో సూపర్ ఫుడ్ జత చేరింది. ఈ పాలలో ప్రొటీన్లు, అత్యవసరమైన అమినో యాసిడ్స్, గుడ్ షుగర్స్ వంటివి పుష్కలంగా ఉంటాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టల్లోగ్రఫీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటున్నది. అవే బొద్దింకల పాలు! చీ బొద్దింకల పాలా? అని ఈసడించుకోకండి.. ఇప్పటి వరకూ కనుగొన్న అత్యధిక పోషకాలు ఉండే ఆహారాల్లో ఇదొకటని శాస్త్రవేత్తలు గడ్డం సవరించుకుని మరీ చెబుతున్నారు. బొద్దింకల పాలు అనగానే బర్రెలు ఇచ్చే పాల వంటివో, మేకలు, గొర్రెలు ఇచ్చే పాలవంటివో లేదా మొన్నామధ్య కొంతకాలం ఫేమస్ అయిన గాడిద పాలువంటివి అనుకోవద్దట! బొద్దింకల పొట్టలో ఉండే పసుపుపచ్చ రంగులోని స్పటికాల రూపంలో ఉన్నవే ఈ పాలు! డిప్లోప్టెరా పంక్టాటా అనే జాతి బొద్దింకలు మాత్రమే తమ పిల్లలకు పాలు ఇస్తాయి. అయితే.. ప్రొటీన్ స్పటికాలను కలిగి ఉన్న తెల్లని ద్రవాన్ని తమ పిల్లల కోసం సదరు జాతి బొద్దింకలు బయటకు పంపుతాయి.
బొద్దింకల నుంచి పాలు తీసేదిలా..
డిప్లోప్టెరా పంక్టాటా జాతి బొద్దింకలు పాలు ఇవ్వగలిగే దశలో ఉన్నప్పుడు ఆ ఆడ బొద్దింకలను చంపి, మధ్య పేగు నుంచి స్పటికాల సేకరణతో పాలు తీస్తారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ఒక వంద మిల్లీ లీటర్ల పాలు ఉత్పత్తి చేయాలంటే.. సుమారు వెయ్యి బొద్దింకలను చంపాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఈ పాలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే వీలు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికి ఇంకా కమర్షియల్ ఉపయోగం నిమిత్తం అందుబాటులోకి తీసుకురాలేదు. సమగ్ర అంచనాలు ఇంకా రూపొందించకపోయినా.. బొద్దింక పాలలో 45 శాతం ప్రొటీన్లు, 25 శాతం కార్బోహైడ్రేడ్లు, 16 నుంచి 22 శాతం ఫ్యాట్, 5 శాతం అమైనో ఆమ్లాలు ఉంటాయని అంచనా వేశారు. ఇతర పాలతో పోల్చినప్పుడు.. బొద్దింక పాలలోనే అత్యధికంగా 232 కిలో క్యాలరీలు (వంద గ్రాములకు) ఉన్నట్టు తేలింది. అదే మానవ పాలలో వంద గ్రాములకు గాను 60 కిలో క్యాలరీలు, గేదె పాలలో 110 కిలో క్యాలరీలు, ఆవు పాలలో 66 కిలో క్యాలరీలు ఉంటాయి. బొద్దింక పాలలోని ఫ్యాటీ యాసిడ్స్, ఒలీక్ యాసిడ్స్, లినోలిక్ యాసిడ్స్ వంటి పోషకాలు దండిగా ఉన్నాయి. కణాల పెరుగుదలతోపాటు.. కణాల మరమ్మతులకు సహాయపడే అమైనో యాసిడ్స్ కూడా వీటిలో గణనీయంగా లభిస్తాయి. పాలు పడని వారికి ఇవి ప్రత్యామ్నాయంగా ఉపయోపడుతాయని అంటున్నారు. అయితే.. బొద్దింకల పాలు మానవ వినియోగానికి సురక్షితమైనవేనని నిరూపించేందుకు ఇంత వరకూ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటి మీద మరిన్ని ప్రయోగాలు నిర్వహించిన తర్వాత గానీ దీనిపై ఒక నిర్ధారణకు రాలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నష్టాలూ ఉన్నాయట
బొద్దింకల పాలతో లాభాలే కాదు.. నష్టాలూ ఉన్నాయని చెబుతున్నారు. బొద్దింకల పాలలో అత్యధికంగా క్యాలరీలు ఉన్నాయి. ఒక కప్పు పాలలో దాదాపు 700 క్యాలరీలు లభ్యమవుతాయి. దీని వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అన్నింటికి మించి వంద మిల్లీలీటర్ల పాల కోసం వెయ్యికిపైగా బొద్దింకలను చంపాల్సి ఉన్న నేపథ్యంలో ఆ పాలను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం నైతికమైన అంశమేనా? అన్న చర్చలు ఉన్నాయి. అన్ని అడ్డంకులను దాటుకుని ముందుకు రాగలిగితే రాబోయే రోజుల్లో బెస్ట్ సూపర్ ఫుడ్‌గా బొద్దింకల పాలు నిలిచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.