clove impact । మన ప్రాథమిక వైద్యశాల మన వంటింట్లోనే ఉంటుందని పెద్దోళ్లు చెబుతుంటారు. దవాఖానకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చాలా వరకూ వంటింట్లోని పోపుల డబ్బాలోనే లభిస్తుంటాయి. అటువంటివాటిలో లవంగం (Cloves) ఒకటి. లవంగాలు అనగానే చికెన్‌లోనో, మటన్‌లోనో లేదా ఏదైనా కూరలోనో మంచి వాసన, రుచి వచ్చేందుకు మాత్రమే వేస్తారనుకుంటే పొరపాటేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దానికి మించిన ఔషధ గుణాలు (potent health benefits) ఉన్నాయని అంటున్నారు. వాటి ఆరోగ్య లాభాల నేపథ్యంలో శతాబ్దాలుగా దీనిని ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. కనీసం రోజుకు ఒక లవంగాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది
రోజుకు ఒక లవంగాన్ని తీసుకుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ (immune system) బలోపేతం అవుతుంది. లవంగాల్లో యాంటిఆక్సిడెంట్లు (antioxidants) పుష్కలంగా ఉంటాయి. ప్రత్యేకించి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌తో పోరాడే యూజెనాల్ (eugenol) అధికంగా ఉంటుంది. శరీరానికి కీడు చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా సాధారణ అనారోగ్యాలైన జలుబు, ఫ్లూ వంటివాటి నుంచి రక్షిస్తుంది.
జీర్ణ క్రియకు సహాయపడుతుంది
లవంగాలు జీర్ణ ప్రక్రియకు (digestion) కూడా ఎంతగానో సహకరిస్తాయి. ప్రతి రోజూ ఒక లవంగం తీసుకోవడం ద్వారా డైజెస్టివ్ ఎంజైమ్‌ల (digestive enzymes) ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అజీర్తి, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. వికారం, కడుపులో ఇబ్బంది వంటివాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అనేక జీర్ణ సంబంధ సమస్యలకు ఇది స్వాభావిక విరుగుడుగా పనిచేస్తుంది.
వాత నివారణ గుణాలు
దీర్ఘకాలంగా వాతంతో (inflammation) బాధపడేవారు ఆర్థ్రైటిస్, గుండె సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్‌లు సహా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. యూజెనాల్ పుష్కలంగా ఉన్న కారణంగా లవంగాలు శక్తిమంతమైన యాంటిఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు కలిగి ఉంటాయి. రోజూ ఒక లవంగం తీసుకుంటే మోకాళ్ల నొప్పుల (joint pain) వంటివి క్రమేపీ తగ్గుముఖం పడతాయి.
నోటి ఆరోగ్యానికీ ఉపయోగం
ఓరల్ హెల్త్ (oral health) కోసం లవంగాలు సంప్రదాయ ఔషధంగా వినియోగిస్తున్నారు. లవంగాల్లోని క్రిమిసంహారక లక్షణాలు.. చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచి.. దంత క్షయాన్ని నివారిస్తాయి. రోజూ ఒక లవంగాన్ని నమలడం వల్ల నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. నోటిలో పొక్కులు కూడా తగ్గుతాయి. పంటి నొప్పులు మటుమాయం అవుతాయి. లవంగాల్లో అనెస్థిటెక్ (anaesthetic) లక్షణాలు కూడా ఉంటాయి. దాన్ని నమలడం వల్ల ఆ ప్రాంతం మొద్దుబారి పంటి నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
శరీరంలో చక్కెర స్థాయిల నియంత్రణ
రక్తంలో చక్కెర శాతం (blood sugar levels) అధికంగా ఉన్నవారికి లవంగం బాగా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చడం, మెరుగైన గ్లూకోజ్ మెటబాలిజాన్ని పెంపొందించడం ద్వారా బ్లడ్ షుగర్‌ను లవంగాలు నియంత్రిస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
కాలేయ ఆరోగ్యానికీ పనికొస్తుంది
శరీరం నుంచి విషతుల్యాలను తొలగించడంలో, పోషకాలను ప్రాసెస్ చేయడంలో కాలేయం (liver) కీలక పాత్ర పోషిస్తుంది. కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలైన ఆక్సిడేటివ్ స్ట్రెస్ (oxidative stress), ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం ద్వారా కాలేయ ఆరోగ్యానికి లవంగాలు సహకరిస్తాయి. లవంగాల్లో పుష్కలంగా లభించే యూజెనాల్ కాలేయ రక్షణలో క్రియాశీలంగా వ్యవహరిస్తాయి. ఫాటీ లివర్ (fatty liver) వంటి వ్యాధులను నిరోధించడంలో సహకరిస్తాయి.
శ్వాసకోశ ఆరోగ్యానికి సహకారం
ఆస్థమా (asthma), ఊపిరితిత్తుల్లో నిమ్ము, దగ్గు వంటి వాటికి చికిత్సలో లవంగాలు సంప్రదాయకంగా వినియోగంలో ఉన్నాయి. వాటికి ఉన్న యాంటి ఇన్‌ఫ్లమేటరీ, కఫ నిర్మూలన గుణాలతో శ్వాస నాళికను క్లియర్ చేయడంలో సహకరిస్తాయి.
ఇది మరీ ముఖ్యం..
ఇంటి వైద్యం కొంత వరకే పరిమితం. ప్రాథమికంగా అనారోగ్యం దరిచేరకుండా కాపాడగలుగుతుంది. అయితే.. అవసరమైన పక్షంలో కచ్చితంగా వైద్య సలహా, చికిత్స తీసుకోవడం మంచిది.