Site icon vidhaatha

Covid 19| వెయ్యి దాటేసిన కొవిడ్‌ కేసులు.. భయం లేదంటున్న వైద్యులు

Covid 19| భారతదేశంలో కొవిడ్‌ కేసులు మరోసారి ఉధృతంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇప్పటి వరకూ తాజాగా వెయ్యి కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో యాక్టివ్‌ కేసులు వంద దాటగా, మహారాష్ట్రలో 200 దాటేశాయి. 430 కేసులతో కేరళ టాప్‌లో నిలిచింది. రోజువారీ కేసుల పెరుగుదల ముంబైనగరంలో ఎక్కువగా కనిపిస్తున్నది. మే 26న ఒక్క ముంబైలోనే కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. తాజాగా విస్తరిస్తున్న వైరస్‌ను ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7గా గుర్తించారు. ఇవి పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. చాలా కేసుల్లో లక్షణాలు చాలా స్వల్పంగానే ఉంటున్నాయి. అయితే.. ఇవి మరింత విస్తరించకుండా ప్రత్యేకించి మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మే 26, 2025 ఉదయం 8 గంటలకు ఉన్న సమాచారం ప్రకారం.. 1,009 యాక్టివ్‌ కొవిడ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. చాలా కేసుల్లో లక్షణాలు స్వల్పంగానే ఉండటంతో చాలా మంది ఇండ్ల వద్దనే ‘హోం ఐసోలేషన్‌’లో ఉంటున్నారని నివేదికలో పేర్కొన్నారు.

మహారాష్ట్రలో కేసుల పెరుగుదల తీవ్రత ఎక్కువగా ఉన్నది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 209 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నలుగురు చనిపోయారు. అయితే.. వారంతా కేవలం కొవిడ్‌ వల్లే చనిపోలేదని, వారికి కోమోర్బిడిటీస్‌ (దీర్ఘకాలిక వ్యాధులు) ఉన్నాయని నివేదికలో తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఓ మోస్తరు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, రోగనిరోధక శక్తిలేమితో బాధపడుతున్నవారికి ప్రత్యేక అడ్వైజరీలు జారీ చేస్తున్నారు.

ఒకే ఒక్క రోజులో నమోదైన కేసుల సంఖ్య విషయంలో దేశ రాజధాని ఢిల్లీ.. మూడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. ఆరోగ్యశాఖ డాష్‌బోర్డ్‌ ప్రకారం.. ఢిల్లీలో 104 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే.. అందరూ సరక్షితంగనే ఉన్నారని, ఇంట్లోనే కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లలో స్వల్ప సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో పెరుగుదల కనిపిస్తున్నది. బెంగళూరులో వయోధికులతోపాటు.. శిశువుల్లోనూ కేసులు కనిపిస్తున్నాయి. కేసులు పెరుగుతున్నా.. పరిస్థితి అదుపులోనే ఉన్నదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు..

రాష్ట్రం యాక్టివ్ కేసులు/మరణాలు
కేరళ               : 430/2
తమిళనాడు : 69/0
మహారాష్ట్ర     : 209/4
కర్ణాటక           : 47/1
ఢిల్లీ                : 104/0
గుజరాత్        : 83/0
ఉత్తర ప్రదేశ్ : 15/0
రాజస్థాన్       : 13/0
బెంగాల్          : 12/0
పుదుచ్చేరి     : 9/0
ఆంధ్రప్రదేశ్ : 4/0
తెలంగాణ      : 1/0
హర్యానా         : 9/0
గోవా               : 1/0
ఛత్తీస్‌గఢ్      : 1/0
మధ్యప్రదేశ్ : 2/0
మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్‌ కేసులు లేవు

Exit mobile version