Health tips : మనలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు (కిడ్నీలు) కూడా ఉంటాయి. ఇవి రక్తాన్ని వడబోసి అందులో ఉండే మలినాలను మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి. శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుతాయి. కిడ్నీలు చెడిపోతే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. సమస్యను త్వరగా గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే మనిషి రోగాల బారినపడి మరణిస్తాడు. కాబట్టి కిడ్నీలను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహార పదార్థాలు కిడ్నీను శుభ్రం చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం..
నీళ్లు
మూత్రపిండాలకు నీరు అత్యంత అవసరం. నీళ్లు శరీరం నుంచి విషాలను, మలినాలను తొలగిస్తాయి. రోజూ తగినంత నీరు తాగడంవల్ల మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి.
వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షించడంలో తోడ్పడుతాయి. శరీరం నుంచి విషాన్ని తొలగించే ప్రక్రియను వేగవంతం చేసే సల్ఫర్ మూలకాలు కూడా దీనిలో ఉంటాయి. రుచి, ఆరోగ్య ప్రయోజనాల కోసం మీరు తాజా వెల్లుల్లిని సూప్‌లు, సాస్‌లు ఇతర వంటకాల్లో ఉపయోగించవచ్చు.
పసుపు
పసుపు అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న ఒక మసాలా పదార్థం. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ కిడ్నీలను గాయాల నుంచి రక్షించడంలో, వాపులను తగ్గించడంలో సాయపడుతుంది. పసుపును కూరలు, సూప్‌లలో వాడుకోవచ్చు. పాలలో వేసుకొని కూడా తాగవచ్చు.
సిట్రస్ జాతి పండ్లు
నారింజ, నిమ్మ, ద్రాక్షపండు లాంటి సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి, సిట్రేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సాయపడుతాయి. సిట్రస్ పండ్లు మూత్రం ఆమ్లతను పెంచుతాయి. సిట్రస్ పండ్లను నేరుగా తినవచ్చు. లేదంటే జ్యూస్‌లు చేసుకుని తాగవచ్చు.
ఆకు కూరలు
పాలకూర, తోటకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరల్లో విటమిన్‌లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేగాక వీటిలో తక్కువ పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యను తగ్గిస్తుంది.