Dangers with Pigeons | పావురాలకు దాణా వేయడం చాలా నగరాల్లో ఫ్యాషన్‌గా మారిపోయింది! పావురాలకు గింజలు వేసి.. పోషించడం ద్వారా తాము అదేదో అంతరించిపోతున్న ఒక జాతి అన్నట్టు దానికి ఆహారం అందించి అవి మనుగడ కొనసాగించేందుకు కృషి చేస్తున్నామన్న ఫీలింగ్‌తో ఉండేవాళ్లూ తక్కువ కాదు. ఆ పావురాల మధ్య తమ చిన్నారులను నిలబెట్టి ఫొటోలు తీసుకుని సంతోషించే పిచ్చి తల్లులూ ఉన్నారు. సాయంత్రం సరదాగా అలా నడుచుకుంటూ వెళ్లి వాటికి మేత వేసే వృద్ధులూ ఉంటారు. కానీ.. పావురాలు అత్యంత ప్రమాదకర పక్షులని మీకు తెలుసా? మీరు ఆ జాతి అంతం కాకూడదనే గట్టిపట్టుదలతో వేసే గింజలు.. మొత్తం మానవాళినే ప్రమాదంలోకి నెడుతున్నాయన్న ఆలోచన మీకు ఎన్నడైనా కలిగిందా? ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. ఇతర ప్రాంతాల సంగతి పక్కనపెట్టి.. ఒక్క హైదరాబాద్‌నే ఉదాహరణగా తీసుకుందాం. నగరంలోని ప్రతి కూడలి వద్ద పావురాల సమూహాలు కుప్పలుకుప్పలుగా ఉంటాయి. వాటికి ఎక్కడెక్కడి నుంచి గింజలు తీసుకొచ్చి చల్లుతూ ఉంటారు. ఇది రాను రాను ఒక సరదా ప్రక్రియగా మారిపోయింది. అవి ఆహార అన్వేషణలో ఎగరడం మర్చిపోయి.. మనం చల్లే గింజల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అనేక నగరాలు పావురాల ప్రమాదాన్ని గుర్తించి, వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
ముంబైలో పావురాలకు ఆహారం అందించేందుకు ప్రత్యేకంగా 51 ‘కబూతర్ ఖానా’లు ఉన్నాయి. వీటన్నింటినీ తక్షణం మూసివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పావురాల విసర్జితాలు, వాటి ఈకల కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు మహారాష్ట్ర శాసనమండలిలో తీవ్ర స్థాయిలో చర్చలు కూడా నడిచాయి. నగరంలోని కబూతర్ ఖానాలు ప్రజల ఆరోగ్యం పాలిట పెను ముప్పుగా తయారయ్యాయని శివసేన (ఉద్ధవ్) ఎమ్మెల్సీ మనీషా కయాండే జూలై మూడో తేదీన మండలి సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ అలెర్జీ, ఆస్థమా అండ్ ఇమ్యూనాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనాన్ని ఆమె సభలో ప్రస్తావించారు. పావురాల విసర్జితాల కారణంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆ అధ్యయనం హెచ్చరిస్తున్నది. ఆమె వాదనలతో ఏకీభవించిన బీజేపీ ఎమ్మెల్సీ చిత్రా వాఘ్… తన సొంత అత్త పావురాల విసర్జితాలకు దీర్ఘకాలికంగా ప్రభావితం కావడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తి చనిపోయారంటూ తెలిపారు. కబూతర్ ఖానాలను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే తరఫున మంత్రి ఉదయ్ సామంత్ ప్రకటించారు. ‘నగరంలో 51 కబూతర్ ఖానాలు ఉన్నాయి. నెల రోజుల్లోగా కబూతర్ ఖానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలు తీసుకోవాలని నగర పాలక సంస్థను ప్రభుత్వం ఆదేశించింది’ అని ఆయన తెలిపారు. కబూతర్ ఖానాలను తక్షణమే మూసివేసే దిశగా చర్యలు తీసుకోవాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించినట్టు చెప్పారు. అనధికారికంగా నగరంలోని వివిధ కూడళ్లలో పావురాల గుంపులకు దాణాలు వేసే ప్రాంతాలను మూసివేసినట్టు తెలిపారు. పావురాల గుంపులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసిన ప్రతిసారీ స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని ఆయన సభ దృష్టికి తెచ్చారు. దాదర్‌లోని ప్రముఖ కబూతర్ ఖానాను మూసివేసినా.. అక్కడ వాటికి నిత్యం దాణా వేసే ప్రజల నిరసనలు, జనాగ్రహం కారణంగా రెండు రోజులకే తెరవాల్సి వచ్చిందని వివరించారు. గిర్‌గావ్ చౌపట్టిలో కొత్త ట్రెండ్ కూడా మొదలైందని, అక్కడ పావురాలు పిజ్జాలు, బర్గర్‌లకు కూడా అలవాటు పడ్డాయని చెబుతూ.. మానవ చర్యల వల్ల పావురాల స్వాభావిక ప్రవర్తన ఎలా మారిపోతున్నదో ఆయన ఉదహరించారు.
పావురాలతో ప్రమాదం ఏమీ లేదని అనుకుంటూ ఉంటాం. కానీ.. పావురాలు చాలా ప్రమాదకరమైనవి. అవి వేసే రెట్టలు, వాటి ఈకలు, వాటిపై ఉండే పేలు వంటివాటి ద్వారా అనేక జంతు సంబంధమైన వ్యాధులను మోసుకెళ్లి మనుషులకు అంటించగలవు. వాటిలో కొన్నింటిని చూద్దాం
హిస్టోప్లాస్మోసిస్ : ఇదొక ఫంగల్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. పావురాలు వేసే రెట్టలు ఎండిపోయి.. గాలిలో కలిసిపోతాయి. ఆ కాలుష్య గాలిని పీల్చడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. అటవీ ప్రాంతాల్లో, లేదా గ్రామీణ ప్రాంతాల్లో వాటి రెట్టలు భూమిలో కలిసిపోతాయి. కానీ.. పట్టణ ప్రాంతాల్లో సిమెంట్, తారు రోడ్లు, ఇళ్లపై పడే ఈ ధూళి అలా వాతావరణంలో తిరుగుతూనే ఉంటుంది.
క్రిప్టోకోకోసిస్ : ఇదికూడా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఫంగల్ వ్యాధి. అంతేకాదు.. కేంద్ర నాడీ వ్యవస్థను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.
ప్సిట్టాకోసిస్ (పావురాయి జ్వరం) : ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీని వల్ల ఫ్లూ వంటి లక్షణాలు, న్యూమోనియా కలుగుతాయి.
సాల్మొనెల్లోసిస్ : పావురాల రెట్టల్లో సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఉంటుంది. ఇది ఇంటి ఉపరితలాలపై లేదా ఆహారంలో కలిస్తే వచ్చే వ్యాధి.
అలెర్జిక్ అల్వియోలిటిస్ (పీజియన్ బ్రీడర్స్ లంగ్) : పక్షి ప్రోటీన్లకు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల తీవ్ర అలెర్జీతో ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పారాసైట్స్ (పరాన్నజీవులు) : పావురాల ఈకల్లో కొన్ని రకాల పురుగులు, పేలు ఉంటాయి. అవి మానవులకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది.
పిల్లలు, వృద్ధులు, ప్రత్యేకించి ఉబ్బసం వ్యాధి ఉన్నవారిలో శ్వాసకోశ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. పావురాల కారణంగా వచ్చే బాక్టీరియా, ఫంగస్‌ల కారణంగా నిరంతరాయ దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం అవడం మొదలుకుని దీర్ఘకాలిక ఊపిరితిత్తుల డ్యామేజ్ వరకూ అనేక లక్షణాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనుషుల ఆరోగ్యం ఒక్కటే కాదు.. పర్యావరణానికి కూడా ఇవి పెను సమస్యగా తయారయ్యాయి. పావురాల విసర్జితాల్లో యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది ఇనుమును తుప్పుపట్టేలా చేస్తుంది. భవనాలు, విగ్రహాలు, ఆఖరుకు కారు పెయింట్‌ను కూడా దెబ్బతీయగలదు. ఫుట్‌పాత్‌లపై పడే రెట్టల కారణంగా కాలుజారి పడిపోయే ప్రమాదాలూ ఉంటాయి. వీటిని శుభ్రం చేయడం తలకు మించిన సమస్యగా మారింది. కొంతమంది తమ ఇళ్లలోకి పావురాలు రాకుండా బాల్కనీలు, రూఫ్‌లపై నెట్‌లు పెట్టుకుంటూ ఉంటారు. ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వీటి కారణంగా బూజు పోగుపడి నివాస ప్రాంతాలను అనారోగ్యకరంగా తయారు చేస్తాయని అంటున్నారు. వీటి బదులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇళ్లలో, ఇళ్లపైన పావురాలు నిలబడకుండా ఉండేలా చూసుకోవాలి. కిటికీలపై ఏర్పాటు చేసుకునే రూఫ్‌లు స్లోప్‌తో ఉండేలా అంటే.. పావురాలు నిలిచే అవకాశం లేకుండా కట్టించుకోవాలి. పాత సీడీలు లేదా అద్దాలు వేలాడదీసి రిఫ్లెక్షన్ వచ్చేలా చేయడం సులభం. అన్నింటికి మించి పావురాలకు మేత వేయడం మానుకోవాలి. మేత వేయడం మానేస్తే సహజంగానే అవి మేతను వెతుక్కుంటూ వెళతాయి. వాటిని ఉద్ధరిస్తున్నామని పోజు కొడితే.. అది డేంజర్‌గా మారి కూర్చుంటుంది.