జేడీఎస్‌.. కర్ణాటక చీఫ్‌ దారెటు?

  • Publish Date - September 30, 2023 / 11:43 AM IST

  • అన్ని మార్గాలూ తెరిచే ఉన్నాయన్న ఇబ్రహీం
  • బీజేపీతో పొత్తుపై తనను సంప్రదించలేదని వ్యాఖ్య


బెంగళూరు: బీజేపీతో పొత్తు విషయంలో తనను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని జేడీఎస్‌ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణ విషయంలో మార్గాలన్నీ తెరిచే ఉన్నాయని తెలిపారు. తాను జేడీఎస్‌కు ఎన్నికైన అధ్యక్షుడినని, ఇష్టం వచ్చినట్టు పార్టీని వదిలిపోలేనని అన్నారు. అయితే తన మార్గాలన్నీ తెరిచే ఉంచుకున్నానని తెలిపారు.


బీజేపీతో పొత్తు ఉనికిలో లేదన్న ఇబ్రహీం.. ఢిల్లీలో వారు కలిసినంత మాత్రాన కూటమిలో చేరినట్టు కాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సమావేశం తర్వాత జేడీఎస్‌ నాయకుడు కేఏ తిప్పేస్వామి తనకు జరిగిన పరిణామాలను తనకు వివరించారని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తన అధికారాలను ఉపయోగిస్తానని అన్నారు.


భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు అక్టోబర్‌ 1న ఇబ్రహీం అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరుగనున్నదని జేడీఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీతో పొత్తు నేపథ్యంలో జేడీఎస్‌లో తీవ్ర అసమ్మతి మొదలైంది. మైసూరు ప్రాంతంలో పార్టీకి అనేక మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. ప్రత్యేకించి మైనార్టీ వర్గాలు పార్టీని వదిలిపెడుతున్నాయి. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయీద్‌ షఫీవుల్లా రాజీనామా చేశారు.


2024 ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేసేందుకు బీజేపీతో జేడీఎస్‌ అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే నెల దసరా తర్వాత సీట్ల పంపకంపై రెండు పార్టీలు ఒక అవగాహనకు రానున్నాయని తెలుస్తున్నది. జేడీఎస్‌తో పొత్తు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే బలోపేతానికి పనికి వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.

Latest News