Uttar Pradesh | యూపీలో బీజేపీ, బీఎస్పీ రహస్య మైత్రి

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, బీఎస్పీ రహస్యంగా చేతులు కలిపాయని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రపదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు.

  • Publish Date - May 27, 2024 / 09:51 PM IST

మాయావతి ఇండియా కూటమికి మద్దతివ్వాలి
దేశాన్ని కాపాడగలితేది ఉత్తరప్రదేశ్‌ మాత్రమే
ఎన్నికల ప్రచారంలో ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌

ఘజియాపూర్‌: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, బీఎస్పీ రహస్యంగా చేతులు కలిపాయని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రపదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. మాయవతి పార్టీకి మద్దతుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజలు దేశ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఇండియా కూటమికి అండదండలివ్వాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన అఖిలేశ్‌యాదవ్‌.. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా ఒక్క ఉత్తరప్రదేశ్‌ మాత్రమే దేశాన్ని కాపాడగలదని చెప్పారు. ‘ఈ ఎన్నికలు మన భవిష్యత్తును కాపాడుకోవడం కోసం. అదే సమయంలో ఈ ఎన్నికలు మనకు భద్రత, మన హక్కులకు రక్షణ కల్పిస్తున్న దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కూడా’ అని అన్నారు.

‘బీజేపీ, బీఎస్పీ ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కుట్రపూరితంగా చేతులు కలిపినట్టు కనిపిస్తున్నది. అందుకే బహుజన సమాజ్‌ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే ఈ ఎన్నికల్లో మీరంతా ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తున్నది. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఏమైనా చేస్తారని అఖిలేశ్‌ హెచ్చరించారు. అనేక సందర్భాల్లో ప్రతిపక్ష ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పనీయకుండా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.

బీజేపీ చార్‌ సౌ పార్‌ నినాదంపై చురకలు వేసిన అఖిలేశ్‌.. ‘నాలుగు వందల సీట్ల గురించి మాట్లాడుతున్నవారు 400 సీట్లు కోల్పోతారు’ అని అన్నారు. ‘బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నది. వారి విశ్వాసం సడలిపోతున్నది. అందుకే వారి నాలుక వణికిపోతున్నది. ఇప్పుడు ఎవ్వరూ బీజేపీ పాత కథలను, కాలం చెల్లిన మాటలను వినదల్చుకోవడం లేదు’ అని చెప్పారు. గత పదేళ్లలో బీజేపీ ఇచ్చిన ప్రతి హామీ బూటకమేనని తేలిపోయిందని గుర్తు చేశారు. పూర్వాంచల్‌ (తూర్పు ఉత్తరప్రదేశ్‌)ను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ఎలాంటి దృష్టి సారించలేదని అఖిలేశ్‌ విమర్శించారు.

ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పూర్వాంచల్‌ అభివృద్ధికి సమాజ్‌వాది పార్టీ ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారికి జూన్‌ 4 తర్వాత మళ్లీ అధికారం దక్కదని అర్థమైపో యిందని, అందుకే వారి భాష మారిపోయిందని అఖిలేశ్‌ చెప్పారు

 

Latest News