ఒసామా బిన్‌ లాడెన్‌తో మోదీని పోల్చిన సంజయ్‌సింగ్‌

అవినీతి గురించి నరేంద్రమోదీ మాట్లాడటం అంటే.. ఒసామా బిన్‌ లాడెన్‌, గబ్బర్‌సింగ్‌ అహింస గురించి మాట్లాడటమేనని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌సింగ్‌ ఎద్దేవా చేశారు

  • Publish Date - April 21, 2024 / 08:56 PM IST

రాంచీ: అవినీతి గురించి నరేంద్రమోదీ మాట్లాడటం అంటే.. ఒసామా బిన్‌ లాడెన్‌, గబ్బర్‌సింగ్‌ అహింస గురించి మాట్లాడటమేనని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌సింగ్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం రాంచీలో నిర్వహించిన ఇండియా కూటమి సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘నరేంద్రమోదీ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. తప్పుడు ఆరోపణలపై హేమంత్‌ సోరెన్‌ను, అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన జైల్లో పెట్టించాడు. ఆయన అవినీతి గురించి మాట్లాడుతుంటే.. ఒసామా బిన్‌ లాడెన్‌, గబ్బర్‌ సింగ్‌ అహింసను ప్రవచించినట్టు ఉన్నది. మీ అవినీతి మరకలన్నింటినీ శుభ్రం చేసే మోదీ వాషింగ్‌ పౌడర్‌ వచ్చింది’ అని ఆయన అన్నారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఆరు నెలలు జైల్లో ఉండి ఇటీవలే సంజయ్‌సింగ్‌ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ‘ఇక్కడ ఇద్దరు వీరపత్నులు కల్పనా సోరెన్‌, సునీతా కేజ్రీవాల్‌ కూర్చొని ఉన్నారు. వారే బయటకు వచ్చారంటే.. మనం కూడా బయటకు రావాలి. ఇక్కడకు వచ్చిన ప్రజలు మోదీని ఓడిస్తామనే సందేశాన్ని ఇవ్వాలి. నేను జైల్లో ఆరు నెలలు ఉన్నాను. అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌ జైల్లోనే ఉన్నారు. మేం భయపడటం లేదు. బ్రిటిషర్లను తరిమికొట్టిన చరిత్ర ఆదివాసులకు ఉన్నది’ అని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు మించి గెలుస్తామంటూ దేశ ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తున్నదని సంజయ్‌సింగ్‌ విమర్శించారు.
‘ఇండియా కూటమి ఇండియా కోసం పనిచేస్తుంది. అదానీ కోసం మోదీ పనిచేస్తారు. 400 మించి పోతాం.. బెంగాల్‌లో 200 మించి పోతాం.. ఢిల్లీలో 35 మించి గెలుస్తాం.. జార్ఖండ్‌లో 65 సీట్లు మించి గెలుస్తాం.. అంటూ దేశాన్ని బీజేపీ తప్పుదోవ పట్టిస్తున్నది. ఈ నాలుగు వందలు మించి పోవడం అనేది ఉత్త బోగస్‌. మిమ్మల్ని వెలేస్తున్నాం అని వారికి చెప్పే సమయం ఆసన్నమైంది’ అని సంజయ్‌సింగ్‌ చెప్పారు.

Latest News