బీజేపీకి లొంగని హేమంత్‌.. అందుకే ఆయన అరెస్ట్‌

జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను భయపెట్టేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని, కానీ.. సోరెన్‌ మాత్రం తాను జైలుకైనా వెళతాను కానీ, ఇండియా కూటమిని వీడేది లేదని స్పష్టం చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

  • Publish Date - April 21, 2024 / 07:48 PM IST

అయోధ్యకు పిలవకుండా ముర్ముకు అవమానం
పార్లమెంటు ప్రారంభానికీ పిలవని మోదీ
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
రాంచీలో ఇండియా కూటమి భారీ సభ

రాంచీ: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను భయపెట్టేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని, కానీ.. సోరెన్‌ మాత్రం తాను జైలుకైనా వెళతాను కానీ, ఇండియా కూటమిని వీడేది లేదని స్పష్టం చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాంచీలోని ప్రభాత్‌ తార మైదానంలో ఉల్గులాన్‌ (తిరుగుబాటు) న్యాయ్‌ ర్యాలీ పేరిట భారీ సభను నిర్వహించారు. ఈ సభనుద్దేశించి మాట్లాడిన ఖర్గే.. సోరెన్‌ ధైర్యవంతుడని ప్రశంసించారు. బీజేపీకి లొంగిపోవడం కంటే జైలుకు వెళ్లడానికే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. గిరిజనులను భయపెట్టాలని ఇంకా చూస్తే బీజేపీని తుడిచిపెడతారని హెచ్చరించారు.
గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవానికి, అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించకుండా ప్రధాని మోదీ ఆమెను, మొత్తం గిరిజనులను అవమానించారని విమర్శించారు. గిరిజనులను బీజేపీ అంటరానివారిగా చూస్తున్నదని మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 150 నుంచి 180 సీట్లకు పరిమితమవుతుందని చెప్పారు.

కేజ్రీవాల్‌ను జైల్లో చంపే కుట్ర
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను తీహార్‌ జైల్లో చంపేందుకు కుట్ర చేస్తున్నారని కేజ్రీవాల్‌ భార్య సునీత ఆరోపించారు. తన భర్త తినే ప్రతి మెతుకును మానిటర్‌ చేస్తున్నారని, ఆయనకు జైల్లో ఇన్సులిన్‌ ఇవ్వకుండా చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంపై కేజ్రీవాల్‌కు ఎలాంటి ఆపేక్ష లేదని, దేశానికి సేవ చేయడం, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి తీసుకురావడమే ఆయన లక్ష్యమని చెప్పారు. చదువుకున్నవారు రాజకీయాల్లోకి రాకపోతే దేశం ఎలా ప్రగతి సాధిస్తుందని కేజ్రీవాల్‌ చెబుతుంటారని తెలిపారు. జైలు తాళాలు పగలగొట్టుకుని అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌ బయటకు వస్తారని చెప్పారు. 12 ఏళ్లుగా కేజ్రీవాల్‌ తీసుకుంటున్న ఇన్సులిన్‌ను జైలు అధికారులు ఆయనకు నిరాకరిస్తున్నారని సునీత తెలిపారు. కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు.
జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదవి వినిపించిన సునీత.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, తమకు బాధ్యతను ఇస్తే.. ఇండియాను గొప్ప దేశంగా మార్చుతామని చెప్పారని తెలిపారు. ఇండియా అంటే కేవలం తమ పేరు మాత్రమే కాదని, మా హృదయాల్లో కూడా ఉన్నదని కేజ్రీవాల్‌ ఆ సందేశంలో పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలను కేజ్రీవాల్‌ ఇచ్చారని చెప్పిన సునీత.. నిరంతరాయంగా 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తామని, పేదలకు ఉచిత విద్యత్తు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, ఉచిత విద్యను అందిస్తామని, ప్రతి గ్రామంలో దవాఖాన ఏర్పాటు, ప్రతి జిల్లాలో మల్టీ స్పెషాల్టీ హాస్పటల్‌ ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా రైతులకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి సాధిస్తామని పేర్కొన్నారు.

వేదికపై ఖాళీ కుర్చీలు
జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌కు సంఘీభావంగా ఖాళీ కుర్చీలను సభా వేదికపై ఏర్పాటు చేశారు. గతంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించిన సభలోనూ ఇదే విధంగా ఖాళీ కుర్చీలు ఉంచిన సంగతి తెలిసిందే. హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పన తన భర్త జైలు నుంచి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ప్రజాస్వామ్యాన్ని తాము విఫలం కానీయబోమని హేమంత్‌ అన్నారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షం గొంతు నులిమేందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌ నుంచి బీజేపీని తరిమి కొడతామని స్పష్టంచేశారు. ఈ ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకావాల్సి ఉన్నా.. ఆకస్మిక అనారోగ్యంతో రాలేదు. ఆయన తరఫున మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.

Latest News