కొత్త హార్మోన్.. క్యాన్సర్ రోగులకు కొత్త హోప్

ఒక శాస్త్రీయ పరిశోధనలో శరీరంలో ఉండే ఒక ప్రత్యేకమైన హార్మోన్ అయిన ఎస్ సిజి2 (సిక్రిటోగ్రానిన్ II) గురించి కొత్త విషయం తెలిసింది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ను ఎలా అడ్డుకుంటుందో వెల్లడైంది.

  • Publish Date - September 24, 2025 / 10:30 AM IST

 ఇటీవల జరిగిన ఒక శాస్త్రీయ పరిశోధనలో శరీరంలో ఉండే ఒక ప్రత్యేకమైన హార్మోన్ అయిన ఎస్ సిజి2 (సిక్రిటోగ్రానిన్ II) గురించి కొత్త విషయం తెలిసింది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ను ఎలా అడ్డుకుంటుందో వెల్లడైంది. ఈ పరిశోధన క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆశలు కలిగిస్తోంది. ఎందుకంటే క్యాన్సర్ కణాలు మన శరీర రక్షణ వ్యవస్థను తప్పించుకుని పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ హార్మోన్ కి, రిసెప్టార్ కి మధ్య జరుగుతున్న చర్యలే.

ఏమిటీ ఎస్ సిజి2 హార్మోన్?

ఎస్ సిజి2 అనేది శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక ప్రోటీన్ హార్మోన్. సాధారణంగా ఇది నాడీ వ్యవస్థ, హార్మోన్ల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ కొత్తగా జరిగిన పరిశోధన చెబుతున్నది ఏమిటంటే.. ఇది ఇమ్మ్యూన్ సిస్టమ్‌లోని ఎల్ ఐఎల్ ఆర్ బి4 అనే రిసెప్టర్‌తో చర్య జరిపి మన వ్యాధి నిరోధక వ్యవస్థ సహజ రక్షణ కణాలైన మైలాయిడ్ సెల్స్ పనితీరును అడ్డుకుంటుంది. దీని వలన మన వ్యాధి నిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించలేకపోతుంది. ఫలితంగా ట్యూమర్లు పెద్దవవుతాయి.

పరిశోధనలో కనుగొన్న అంశాలు
• శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఎస్ సిజి2, ఎల్ ఐఎల్ ఆర్ బి4 మధ్య జరిగే చర్యని బ్లాక్ చేసినప్పుడు, ట్యూమర్ల పెరుగుదల గణనీయంగా తగ్గిపోయింది.
• ఈ రిసెప్టర్‌ను లక్ష్యంగా చేసుకోవడం వలన, వ్యాధి నిరోధక కణాలు తిరిగి చురుకుగా పని చేయగలిగాయి.
• ఎలుకలపై చేసిన అధ్యయనాలు దీన్ని నిర్ధారించాయి. ఎస్ సిజి2 లేకుండా ఉన్నప్పుడు ట్యూమర్లు అంత వేగంగా పెరగలేదు.

క్యాన్సర్ చికిత్సలో కీలకం
ఇప్పటి వరకు క్యాన్సర్ చికిత్సలో ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్ హిబిటర్లు అనే ఔషధాలు ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చాయి. కానీ ఇంకా చాలా మంది రోగులకు అవి సమర్థవంతంగా పనిచేయడం లేదు. ఇప్పుడు ఎస్ సిజి2 – ఎల్ ఐఎల్ ఆర్ బి4 మార్గం కొత్తగా గుర్తించబడింది కాబట్టి, దీన్ని బ్లాక్ చేసే ప్రత్యేకమైన ఔషధాలు తయారు చేస్తే, ప్రస్తుత చికిత్సలతో కలిపి మరింత శక్తివంతమైన ఫలితాలు రావచ్చు. ఇది ముఖ్యంగా ఇమ్యూన్ రెసిస్టెంట్ క్యాన్సర్ల (ప్రస్తుత చికిత్సలకు స్పందించని క్యాన్సర్లు) లో ఆశాజనక ఫలితాలను ఇవ్వొచ్చు.

ఆటోఇమ్యూన్ వ్యాధులకు
ఇది కేవలం క్యాన్సర్ చికిత్సకే పరిమితం కాదు. ఎస్ సిజి2 – ఎల్ ఐఎల్ ఆర్ బి4 మార్గం ఇమ్యూన్ సిస్టమ్‌ను తగ్గించే పని చేస్తుంది. కాబట్టి రుమాటాయిడ్ ఆర్థరైటిస్, ల్యూపస్, మల్టిపుల్ స్క్లిరోసిస్ లాంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు, క్రానిక్ ఇన్ ఫ్లమేషన్ వంటి సమస్యలకు కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడంలో తోడ్పడుతుంది.

పరిశోధన పరిమితులు
ఈ అధ్యయనం ప్రస్తుతం ప్రధానంగా జంతువుల మోడల్స్, ప్రయోగశాల స్థాయి పరిశోధనలపై ఆధారపడి ఉంది. కాబట్టి మనుషులపై ఈ విధానం ఎంతవరకు సమర్థవంతమవుతుందో తెలియదు. హార్మోన్‌ లను అడ్డుకోవడం వల్ల అనుకోని ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా చురుకైనప్పుడు ఆటోఇమ్యూన్ వ్యాధులు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
ఇప్పటికీ ఇది ప్రారంభ దశలో ఉన్నప్పటికీ భవిష్యత్ వైద్య శాస్త్రంలో ఇది ఒక గేమ్-చేంజర్ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.