Health tips : మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తినాలి. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. పోషకాల గనుల లాంటి కొన్ని రకాల కూరగాయల గురించి చాలామందికి తెలియదు. అలాంటి వాటిలో ‘టిండా (Tinda)’ ఒకటి. దీన్ని దిల్ పసంద్, ఇండియన్ బేబీ పంప్‌కిన్, యాపిల్ గార్డ్ అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో ఈ బేబీ గుమ్మడి కాయలను డైట్‌లో చేర్చుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
టిండాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్‌కు ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ప్రతి భాగాన్ని ఉత్తేజపరుస్తాయి. టిండాలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఫుడ్. దీంట్లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, కాపర్ లాంటి పోషకాలుంటాయి.
టిండాతో రకరకాలుగా కూరలు వండుకోవచ్చు. ఇది శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపర్చుతుంది. వాయు కాలుష్యం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలర్జీలు, శ్వాస సమస్యలను కూడా తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే సమ్మేళనాలు టిండాలో పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఇవీ ప్రయోజనాలు..
బరువు తగ్గడం : టిండాలోని ఫైబర్ పొట్టను ఎక్కువ సమయం సంతృప్తి భావనలో ఉంచుతుంది. ఫలితంగా అతిగా ఆకలి వేయదు. అందుకే టిండాను రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకుంటే క్రమంగా బరువు తగ్గవవచ్చు.
గుండె పదిలం : టిండాలో కొలెస్ట్రాల్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు దీన్ని డైట్‌లో చేర్చుకుంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెలో రక్త ప్రసరణ, గుండె కండరాల పనితీరును ఈ టిండా మెరుగుపరుస్తుంది.
కంటి చూపు : టిండా నుంచి విటమిన్ ఎ లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సైతం ఉంటాయి. ఇవి కంటి రెటీనాలో కీలకమైన భాగాలను సంరక్షిస్తాయి.
జ్ఞాపకశక్తి : టిండాతోపాటు దాని గింజలను తినడంవల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీర ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. దీనిలోని సమ్మేళనాలు మలబద్ధకం, కడుపులో ఇన్‌ఫ్లమేషన్, తిమ్మిర్లు లాంటి సమస్యలకు చెక్ పెడతాయి.
చర్మ ఆరోగ్యం : టిండాలోని విటమిన్ E కంటెంట్ చర్మం పొడిబారడాన్ని నివారిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. వర్షాకాలంలో వచ్చే అలర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఇది దూరం చేస్తుంది. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతుంది.
క్యాన్సర్ నివారణ : పాలీఫెనాల్, కుకుర్బిటాసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు టిండాలో పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను, క్యాన్సర్‌కు కారణమయ్యే టాక్సిన్స్‌ను నిర్మూలిస్తాయి.