Sucheta Kripalani | తొలి మ‌హిళా ముఖ్య‌మంత్రి.. ఎవ‌రీ సుచేతా కృపాలానీ..?

  • Publish Date - April 9, 2024 / 08:07 PM IST

Sucheta Kripalani | భార‌త స్వాతంత్య్ర ఉద్య‌మంతో పాటు ఈ దేశ రాజ‌కీయాల్లో మ‌హిళ‌లు త‌మ‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి మ‌హిళ‌ల్లో ఒక‌రు సుచేతా కృపాలానీ. ఆమె భారత రాజ‌కీయాల‌కు ఒక ఐకాన్‌గా నిలుస్తారు. ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధురాలు, భార‌త‌దేశంలో తొలి మ‌హిళా ముఖ్య‌మంత్రి కూడా సుచేత కృపాలానీ. పురుషాధిక్యం ఉన్న భార‌త రాజ‌కీయాల్లో ఆమె వారికి స‌మానంగా నిలిచింది. మ‌రి ఆమె జీవిత విశేషాలు ఏంటో తెలుసుకుందాం..

1908, జూన్ 25న పంజాబ్‌లోని అంబలాలో సుచేత కృపాలానీ జ‌న్మించారు. ఆమె తండ్రి వృత్తిరీత్యా డాక్ట‌ర్. వీరికి దేశ‌భ‌క్తి ఎక్కువ‌. ఈ క్ర‌మంలో సుచేత త‌న చిన్న‌త‌నం నుంచే దేశ‌భ‌క్తిని పెంపొందించుకుంది. న్యూఢిల్లీలోని ఇంద్ర‌ప్ర‌స్థ కాలేజీ, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో త‌న ఉన్న‌త విద్య‌ను పూర్తి చేశారు. ఉన్న‌త విద్య పూర్త‌యిన త‌ర్వాత బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీలో రాజ్యాంగ చ‌రిత్ర లెక్చ‌ర‌ర్‌గా ప‌ని చేశారు. భార‌త స్వాతంత్య్ర ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్నారు. తొలి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచారు. ఆ త‌ర్వాత ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు తొలి మ‌హిళా ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. దేశంలో తొలి మ‌హిళా సీఎం కూడా సుచేత కృపాలానీనే.

క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న స‌మ‌యంలో, మహాత్మా గాంధీ వంటి నాయకులతో కలిసి బ్రిటిష్ వలస పాలనను నిర్భయంగా ఎదుర్కొన్నారు సుచేతా కృపాలానీ. విభ‌జ‌న అల్ల‌ర్ల స‌మ‌యంలో గాంధీతో క‌లిసి హింస‌ను త‌గ్గించ‌డానికి, మ‌త సామ‌ర‌స్యాన్ని పెంపొందించేందుకు త‌న వంతు కృషి చేసింది. రాజ్యాంగ స‌భ‌లో కూడా ఆమె కీల‌క‌పాత్ర పోషించింది. భార‌త రాజ్యాంగాన్ని రూపొందించ‌డంలో ఆమె పాత్ర కూడా ఉంది. అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ను స్థాపించడం ద్వారా మహిళల హక్కుల కోసం పోరాడింది.

స్వాతంత్య్ర ఉద్య‌మం అనంత‌రం ఆమె రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేత, సామాజిక వేత్త ఆచార్య కృపాలానితో ఆమెకు 1936లో వివాహం జరిగింది. సుచేత భ‌ర్త జేబీ కృపాలానీ స్థాపించిన కిసాన్ మ‌జ్దూర్ ప్ర‌జా పార్టీ త‌ర‌పున 1952లో జ‌రిగిన తొలి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసి పార్ల‌మెంట్‌కు ఎన్నికైంది. కేంద్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ శాసనసభకు కాన్పూర్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఆ మరుసటి ఏడాది అంటే 1963లో ఉత్తర ప్రదేశ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా కృపాలాని బాధ్యతలు చేపట్టారు. ఆ పదవిలో ఆమె నాలుగేళ్లు పాటు కొనసాగారు. 1971 క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్న సుచేతా 1974లో కన్నుమూశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజైన 1947 ఆగస్టు 15వ తేదీన రాజ్యాంగ సభలో వందేమాతరం పాడారు సుచేతా.

Latest News