విధాత, హైదరాబాద్ : మరోసారి జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌ల గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీటి విడుదల చేపట్టారు. దీంతో మరోసారి మూసీనది పరవళ్లు తొక్కుతోంది. ఉస్మాన్ సాగర్ 3 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1789.40 అడుగుల మేర వరద నీరు చేరింది. ఇన్‌ఫ్లో 300 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2028 క్యూసెక్కులుగా ఉంది.
హిమాయత్ సాగర్ 2 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1760.40 అడుగుల మేర వరద నీరు చేరింది. ఇన్‌ఫ్లో 400 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2000 క్యూసెక్కులుగా ఉంది.
మూసీ పరివాహక బస్తీలు అప్రమత్తం
జంట జలాశయాల నుంచి నీటి విడుదల కొనసాగిస్తున్న నేపథ్యంలోనే.. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. మూసీకి వరద పెరగడంతో.. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లంగర్ హౌజ్, పురానాపూల్, చాదర్‌ఘాట్, అంబర్‌పేట్, చైతన్యపురితో పాటు తదితర ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇటీవల జంట జలాశయాల నుంచి సుమారు 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో మూసీకి వరద పోటెత్తగా.. నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. పురానాపూల్ వద్ద 13 అడుగుల మేర మూసీ ప్రవాహం కొనసాగింది. ఎంజీబీఎస్‌ను కూడా వరద నీటితో జలమయమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాదర్‌ఘాట్, అంబర్‌పేట వద్ద పలు ఇండ్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటనల నుంచి తేరుకోక ముందే మళ్లీ మూసీకి వరద పెరగడంతో నది పరివాహక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.