విధాత, హైదరాబాద్: హైదరాబాద్ లో ఈనెల 8, 9 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించబోతున్న అంతర్జాతీయ స్థాయి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 కు భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని ‘ఫ్యూచర్ సిటీ’లో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ వేడుకకు దేశ, విదేశాల ప్రముఖులు, కంపెనీలు తరలిరాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రులు దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను, బడా కంపెనీలను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించడం విశేషం. ‘తెలంగాణ రైజింగ్ థీమ్’తో రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పరిశ్రమల అధినేతలు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, సినీ, క్రీడా, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులు, విదేశీ రాయబారులు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను ఆహ్వానించింది. సుమారు 4,800 మందికి ఆహ్వానాలు పంపగా..2వేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
సదస్సు కోసం ప్రత్యేక ప్రాంగణాలు
సమ్మిట్ జరిగే ప్రాంతంలో సుమారు 14 వేల చదరపు మీటర్లతో కూడిన 8 ప్రత్యేక ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దేశ, విదేశీ ప్రముఖులతో కలిసి చర్చించేందుకు వీలుగా ప్రధాన ప్రాంగణం ఇనాగురల్ హాల్‌కు అనుబంధంగా ప్రత్యేకంగా గదులను సిద్ధంచేస్తున్నారు. ప్రధాన ఇనాగురల్ హాల్‌తో పాటు బ్రేక్‌అవుట్ సెషన్ హాల్స్, మీడియా రూం, డైనింగ్ హాళ్లు, సైట్ ఆఫీస్‌లు, పోలీస్ శిబిరం, ఫైర్ ఫైటింగ్ వంటి.. 33 ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నారు. కుడివైపు ప్రముఖుల భోజనాల కోసం మూడు డైనింగ్‌హాళ్లను నిర్మించారు. అతిధులు భోజనం చేసేందుకు వీలుగా 6,500 చదరపు మీటర్లతో ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ప్రధాన సదస్సు ప్రాంగణం పక్కనే వివిధ రంగాలకు చెందిన 45 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మహిళాశక్తి, పరిశ్రమలు సహా ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు రంగాలకు చెందిన స్టాళ్లు ఉండనున్నాయి.
సదస్సుకు వెళ్లే రహదారులను కొత్తగా నిర్మిస్తున్నారు. ప్రధానంగా తుక్కుగూడ-శ్రీశైలం రహదారికి మరమ్మతులు పూర్తిచేశారు. ఓఆర్‌ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారి పొడవునా.. తెలంగాణ రైజింగ్ నినాదాలతో కూడిన హోర్డింగులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతిష్ఠాత్మక పథకాలతో పాటు.. మహిళలు, యువత, రైతులు, మానవ వనరులు తదితర అంశాలతో కూడిన ప్రాధాన్య రంగాలను ఆయా హోర్డింగ్‌లో పొందుపరిచారు.
10 వేల మందికి నిరంతర వైఫై సేవలు..అంతటా ఎల్ ఈడీ తెరలు
సమ్మిట్ జరుగుతున్న ఫ్యూచర్ సిటీలో కీలకమైన ఇంటర్నెట్ సేవల కోసం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రత్యేకంగా నెట్ వర్క్ వసతి కల్పించింది. ప్రాంగణంలో అండర్‌గ్రౌండ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్ సిద్ధంచేసి.. 5జీ డేటా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరంతరం 10 గిగా బైట్స్ పర్ సెకన్(జీబీపీఎస్) వేగంతో..సుమారు 10వేల మంది ఏకకాలంలో వైఫై వినియోగించుకునే సదుపాయాన్ని అందించింది. సుమారు 100 ఎకరాల్లోని ప్రాంగణమంతా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రోడ్డు వెంట ఎల్ ఈడీ తెరలను సిద్దం చేస్తున్నారు. అందులో ప్రధాన ప్రాంగణం ఎదురుగా 85 మీటర్ల వెడల్పుతో ఏర్పాటుచేసిన భారీ తెర ప్రత్యేక ఆకర్షణగా కనిపించనుంది. సదస్సులో జరిగే కార్యక్రమాలను, తెలంగాణ రైజింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని వీటిపై నిరంతరాయంగా ప్రసారం చేయనున్నారు. గ్లోబల్ సమిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో.. తెలంగాణ పోలీసులు మూడంచెల భద్రత కల్పిస్తున్నారు.
27 ప్రత్యేక సెషన్లు, వివిధ రంగాలపై చర్చలు
రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ సమ్మిట్‌లో రెండు రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు కొనసాగనున్నాయి. సదస్సులో భాగంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో చర్చావేదికలు నిర్వహిస్తారు. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ–సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు జరుగనున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల సదస్సులో దాదాపుగా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు
ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరయ్యే అతిథులను అలరించేందుకు ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక, కళారూపాల ప్రదర్శనలకు ఏర్పాట్లు చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి 90 నిమిషాల పాటు సంగీత కచేరి నిర్వహించబోతున్నారు. ప్రముఖ విద్వాంసురాలు పి.జయలక్ష్మి వీణా వాయిద్యం, కళా కృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం, ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణులు తమ ప్రదర్శనలతో అలరించబోతున్నారు. అలాగే తెలంగాణ సంస్కృతి, కళారూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, కోలాటం వంటి ప్రదర్శనలతో అతిధిలకు స్వాగతం పలకనున్నారు.
సమ్మిట్ వద్దకు బస్సు వసతి
గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ వేడుకలను ప్రజలందరూ ఉచితంగా చూసేందుకు 10వ తేదీ నుంచి 13వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగు రోజుల పాటు మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు. ప్రభుత్వశాఖల స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ఆసక్తి ఉన్నవారు సదస్సు ప్రాంగణానికి చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఉచిత బస్సులను ఏర్పాటుచేసింది. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్‌బీనగర్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని సమ్మిట్ నిర్వాహకులు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు(వెళ్లేందుకు), సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు(తిరిగి వచ్చేందుకు) నడుస్తాయని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Gummadi Narsaiah Biopic : గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
Sasirekha Song Promo | సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’… అలరిస్తున్న ‘శశిరేఖ’ ప్రోమో సాంగ్
