Magnati Sunitha | ఆమె మాగంటి గోపినాధ్ భార్య కాదు…సునీత నామినేషన్ రద్దు చేయండి: కొడుకు ఫిర్యాదు

జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్‌ను రద్దు చేయాలని దివంగత మాగంటి గోపీనాథ్ చట్టబద్ధ కుమారుడు తారక్ ప్రద్యుమ్నా కొసరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. సునీత గోపీనాథ్ చట్టబద్ధ భార్య కాదని, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉందని ఆరోపించారు.

Maganti sunitha

విధాత, హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ రద్దు చేయాలంటూ దివంగత గోపినాధ్ ఏకైక చట్టబద్దమైన కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్ ప్రద్యుమ్నా కొసరాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన లేఖలో సునీత తప్పుడు సమాచారం ఇచ్చారని, పలు విషయాలను దాచిపెట్టారని తన ఫిర్యాదులో ఆరోపించారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ 2025 జూన్ 8న మరణించారు. తారక్ ప్రద్యుమ్నా ప్రకారం గోపీనాథ్ 1998 ఏప్రిల్ 29న కోసరాజు మాలిని దేవిని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆయన మరణం వరకు కొనసాగింది. వారి మధ్య ఎలాంటి విడాకులు లేవు. తాను వారి ఏకైక చట్టబద్ధ కుమారుడినని తారక్ తన ఫిర్యాదులో తెలిపారు.

సునీత, ఆమె పిల్లలు చట్టబద్ద వారసులు కాదు

అయితే, సునీత మాగంటి గోపీనాథ్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారని, తనను ఆయన చట్టబద్ధ భార్యగా, తన పిల్లలను చట్టబద్ధ వారసులుగా తప్పుగా చూపారని తారక్ ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ఇలా తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 125ఏను ఉల్లంఘించినట్టు అవుతుందని తారక్ వాదిస్తున్నారు.
ఈ ఆరోపణలకు మద్దతుగా, రాజేంద్రనగర్ డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్‌డీఓ) 2025 అక్టోబర్ 11న జారీ చేసిన ఆర్డర్‌ను (రిఫరెన్స్ నెం. సి/2100/2025) జతచేశారు. ఈ ఆర్డర్‌లో సునీత తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందారని, గోపీనాథ్ మొదటి వివాహ విషయాలను దాచిపెట్టారని పేర్కొన్నారు. ఈ వివాదంలో ఆ సర్టిఫికెట్‌ను (నెం. సి/08/2025-262, తేదీ 04.07.2025) రద్దు చేసిన ఆర్‌డీఓ సునీత గోపీనాథ్ చట్టబద్ధ భార్య కాదని ధృవీకరించారు.

ఇకపోతే తారక్ ప్రద్యుమ్నా ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌కు పంపిన లేఖలో అఫిడవిట్ ధృవీకరణ చేయాలని, సునీత తప్పుడు సమాచారానికి చర్యలు తీసుకోవాలని, అమె నామినేషన్ ను రద్దు చేయాలని కోరారు. అవసరమైతే హైదరాబాద్‌కు వచ్చి విచారణకు సహకరిస్తానని చెప్పారు. తన ఫిర్యాదుకు మద్దతుగా తారక్.. ఆర్‌డీఓ ఆర్డర్, తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికెట్, తల్లిదండ్రుల వివాహ ఫోటోలు (1998), తన బర్త్ సర్టిఫికెట్ లను జతపరిచి ఎన్నికల అధికారికి సమర్పించాడు.

బహిరంగంగా స్పందించని మాగంటి సునీత

అయితే మాగంటి గోపినాధ్ చట్టబద్దమైన కొడుకుగా చెప్పుకుంటున్న తారక్ ప్రద్యుమ్నా కొసరాజు చేసిన ఆరోపణలపై మాగంటి సునీత వైపు నుంచి ఇంకా స్పందన వెల్లడి కాలేదు. ఎన్నికల కమిషన్ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇటీవలి ఎన్నికల అఫిడవిట్ లో సునీత తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఓటర్ జాబితాలో మోసాల ఆరోపణలపై కోర్టుకు వెళ్లారు.

అఫిడవిట్ అభ్యంతరాలపై కోర్టులోనే తేల్చుకోవాలి : ఎన్నికల అధికారులు

మాగంటి గోపీనాథ్ కు సునీతా గోపినాథ్ రెండో భార్య అనే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదని..ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేసినట్లుగా సమాచారం. అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు తప్పా..ఒప్పా అని తేల్చే పని.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిధిలోకి రాదని వారు స్పష్టం చేశారు. ఇకపోతే మాగంటి గోపీనాథ్ రెండో వివాహం విషయంలో 2023 అసెంబ్లీ ఎన్నిక తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. గత మూడు ఎన్నికల్లో మాగంటి సునీతను తన భార్య అని మాగంటి గోపినాధ్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం.

మరోవైపూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత వేసిన 4 నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదించారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె ఈ ఎన్నికల బరిలో ఉండబోతున్నారు.