Site icon vidhaatha

airstrikes in Lebanon । లెబనాన్‌పై బాంబుల వర్షం.. 492 మంది మృతి.. వెయ్యి మందికి గాయాలు

airstrikes in Lebanon । పేజర్ల వంటి కమ్యూనికేషన్‌ పరికరాల పేలుళ్ల ఘటన నుంచి కోలుకోక ముందే లెబనాన్‌(Lebanon)పై ఇజ్రాయెల్‌ (Israel) విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌పై సోమవారం నుంచి ప్రారంభించిన వైమానిక దాడుల్లో (airstrikes) సుమారు 492 మంది చనిపోయారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. 2006 తర్వాత లెబనాన్‌పై ఇంతటి భీకర దాడులు ఇదే ప్రథమం. హిజ్బుల్లా (Hezbollah) స్థావరాలపై దాడులను మరింత విస్తరించనున్నామని పేర్కొన్న ఇజ్రాయెల్‌ మిలిటరీ..  తూర్పు లెబనాన్‌ పౌరులు ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.

ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో 35 మంది చిన్నారులు, 58 మంది మహిళలు సహా 492 మంది చనిపోయారని లెబనాన్‌ ఆరోగ్య శాఖ (Lebanon’s health ministry) ధృవీకరించింది. వెయ్యి మందికిపైగా గాయపడ్డారని పేర్కొన్నది. మరోవైపు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ తూర్పు లెబనాన్‌ పౌరులకు దాదాపు 80 వేల ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.  ఈ కాల్స్‌ అన్నీ ఇజ్రాయెల్‌ నుంచి వచ్చినవిగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే గాజా యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో లెబనాన్‌పైనా ఇజ్రాయెల్‌ దాడులకు తెగబడటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నది.

హిజ్బుల్లా మిమ్మల్ని రక్షణకవచంగా వాడుకుంటున్నది : నెతన్యాహు

లెబనాన్‌ పౌరులనుద్దేశించి ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజిమిన్‌ నెతన్యాహు (Netanyahu) ఒక రికార్డెడ్‌ సందేశాన్ని విడుదల చేశారు. ‘హిజ్బుల్లా మిమ్మల్ని మానవ కవచంగా (Human Shield) వాడుకుంటున్నది. ఇజ్రాయెల్‌ చెప్పిన మాట విని.. ఖాళీ (evacuate) చేసి వెళ్లిపోండి. ఈ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోండి’ అని అన్నారు. తాము లెబనాన్‌తో యుద్ధం చేయడం లేదని, ఇరాన్‌ సపోర్టు ఉన్న ఉగ్రవాద సంస్థతో యుద్ధం చేస్తున్నామని నెతన్యాహు చెప్పారు. ‘ప్రమాదానికి దూరంగా ఉండండి.. మా ఆపరేషన్‌ పూర్తికాగానే భద్రంగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు’ అని దాడులకు ముందు నెతన్యాహు ఆ సందేశంలో పేర్కొన్నారు. లెబనాన్‌, ఇజ్రాయెల్‌ సరిహద్దుల నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లను తరిమివేసేందుకు తమ ఆర్మీ అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటుందని ఇజ్రాయెల్‌ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారి చెప్పారు. అయితే.. ఎంతకాలంలో ఈ ఆపరేషన్‌ పూర్తవుతుందనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు.

గత అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకూ ఇజ్రాయెల్‌ పైకి సుమారు 9వేల రాకెట్లను ప్రయోగించిందని హగారి చెప్పారు. ఒక్క సోమవారం రోజునే 250 రాకెట్లు ప్రయోగించిందని తెలిపారు. హిజ్బుల్లా వద్ద లక్షన్ననర వరకూ రాకెట్లు, క్షిపణులు ఉండి ఉంటాయని ఇజ్రాయెల్‌ అంచనా వేస్తున్నది. వీటిలో గైడెడ్‌ మిస్సైళ్లు, ఇజ్రాయెల్‌లో ఏ ప్రాంతంలోని లక్ష్యాలనైనా ఛేదించగల లాంగ్‌ రేంజ్‌ ప్రొజెక్టయిల్స్‌ కూడా ఉన్నాయి.

Exit mobile version